ప్రజాశక్తి – నగరం
జెకెసిలో వచ్చిన అర్జీలకు అధికారులు అధిక ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు. మండలంలోని ఎస్‌విఆర్‌ఎం కళాశాల ఆడిటోరియంలో జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. అర్జీదారులు అధిక సంఖ్యలో స్పందనకు హాజరైనప్పటికీ 17అర్జీలు మాత్రమే నమోదు అయ్యాయి. జెకెసిలో నమోదయ్యే అర్జీలు ముఖ్యమంత్రికి వెళ్లినట్లుగా అధికారులు భావించాలని కలెక్టర్ చెప్పారు. ఇప్పటి వరకు మండలం నుంచి 282అర్జీలు నమోదైనట్లు తెలిపారు. 85శాతం అర్జీలను పరిష్కరించినప్పటికీ 18అర్జీలు పునరావృతం కావడంపై ఆయన ఆరా తీశారు. జెకెసిలో నమోదైన అర్జీలు నాణ్యతతో పరిష్కరిస్తే పునరావృతం కావని స్పష్టం చేశారు. అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని తెలిపారు. పునరావృతమైన ఆర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. అర్జీదారులను కార్యాలయాల చుట్టూ తిప్పుకోవడం మంచి పద్ధతి కాదని సూచించారు. నగరంలో పారిశుద్ధ్యం మెరుగుపడాలని చెప్పారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా నిర్దేశించినట్లు పారిశుద్ధ్యం చేపట్టాలని అన్నారు. మండలంలోని జగనన్న కాలనీలలో పక్కా గృహ నిర్మాణాలు మరింత వేగంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు లక్ష్యాలు నిర్దేశించినప్పటికీ వాటిని చేరుకోలేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. పద్ధతి మార్చుకొని నిబద్ధతతో పనిచేయాలని ఇంజినీరింగ్ అసిస్టెంట్లను ఆదేశించారు. ఇళ్ళ స్థలాలు కేటాయించాలని నగరం ఎస్సీ కాలనీవాసులు కోరారు. గ్రామానికి చెందిన పిన్నిబోయిన గోపాలరావు తన భూమిలో ఆక్రమణలు తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ధూళిపూడి సౌత్ శివారు కారంకివారిపాలెంలోని పంచాయితీకి చెందిన చెరువు ఆక్రమణకు గురై వ్యర్థాలను చెరువులోకి వదులుతున్నారని, అందుకు బాధ్యలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కొలగానివారిపాలెం శివారు లుక్కావారిపాలెం గ్రామస్తులకు స్మశానానికి స్థలం కావాలని కోరారు. మరి కొందరు తమ భూములు ఆన్లైన్లో సక్రమంగా నమోదు చేయాలంటూ అర్జీలు దాఖలు చేశారు. గతంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో మండలం నుంచి 282అర్జీలు అందాయని తెలిపారు. వాటిలో 85శాతం సమస్యలు పరిష్కరించినట్లు చెప్పారు. తొలుత కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అనగాని హరికృష్ణ జిల్లా కలెక్టరు రంజిత్బాషాను సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, రేపల్లె ఆర్‌డిఒ బిఎస్ హేలాషారోన్, మండల ప్రత్యేక అధికారి సైదా నాయక్, ఎంపీపీ చింతల శ్రీకృష్ణయ్య, సర్పంచ్ ఇంకొల్లు రామకృష్ణ, డిఎల్పిఓ తాతా శంకరరావు, రేపల్లె రూరల్ సిఐ శివశంకరరావు, ఎస్బి డి రామకృష్ణ, తహశీల్దారు ఎం ప్రమీల, ఎంపీడీఓ ఎంకె చక్రపాణిప్రసాద్, ఎంఇఓ కె హరిబాబు, ఎఓ వేమూరి రమేష్బాబు, డిటి ఎం శ్రీనివాసరావు పాల్గొన్నారు.