ప్రజాశక్తి – పంగులూరు
ఎయిడ్స్ రోగులపట్ల వివక్ష చూప కుండా వారిలో మానసిక మనోధైర్యాన్ని నింపాలని పిహెచ్‌సి డాక్టర్ శివ చెన్నయ్య, డాక్టర్ బాల రాజేశ్వరి దేవి సూచించారు. మండలంలోని కొండమూరులో వైద్య ఆరోగ్య సిబ్బంది శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ శివ చెన్నయ్య మాట్లాడుతూ ఎయిడ్స్ వచ్చిన వారికి మంచి పౌష్టికాహారం ఇవ్వాలన్నారు. క్రమం తప్పకుండా మందులు వేసుకోవాలని సూచించారు. ప్రేమగా ఉండటం వలన వారి మానసిక స్థితి, శారీరక పరిస్థితి మెరుగుపడుతుందని అన్నారు. ఒకరు వాడిన సూదులు, బ్లేడ్లు, రక్తమార్పిడి ద్వారా, సురక్షితం లేని శారీరక సంబంధాల ద్వారా వ్యాధి వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు మదర్సా, హరిబాబు, రమాదేవి, ల్యాబ్ టెక్నీషియన్ హరిచందన, ఫార్మసిస్ట్ పద్మావతి, స్టాఫ్ నర్స్ శివనాగేశ్వరరావు, ఏఎన్ఎంలు రాధ, ఎస్తేరు, శివకోటేశ్వరి, సిహెచ్ఓ ఏసోబు, పావని, ఆరోగ్య కార్యకర్తలు జాషువా, సతీష్ పాల్గొన్నారు.
ఇంకొల్లు రూరల్ : మండలంలోని ఇడుపులపాడు విద్యా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రపంచ హెచ్ఐవి, ఎయిడ్స్ అవగాహన దినోత్సవం శుక్రవారం నిర్వహించారు. పాఠశాల హెచ్‌ఎం పిడపర్తి పేరిరెడ్డి అధ్యక్షత వహించారు. విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా పేరిరెడ్డి మాట్లాడుతూ వివాహానికి ముందు లైంగిక సంబంధాలకు దూరంగా ఉండాలని అన్నారు. వివాహ జీవితంలో జీవిత భాగస్వామితో మాత్రమే లైంగిక సంబంధాన్ని పరిమితం చేసుకోవాలని సూచించారు. సైన్స్ ఉపాధ్యాయుని భవనం శివలీల హెచ్ఐవి ఏ విధంగా సోకుతుందో వివరించారు. నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. సోకిన వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పారు. ఏ స్థాయిలో ఎయిడ్స్ వ్యాధిగా రూపొందుతుందనేది చెప్పారు. దాని నివారణ మార్గాలు గురించి వివరించారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పర్వతనేని పావని, పెంట్యాల పావని, బండారు అనిల్ కుమార్, అంబటి సురేష్, వసంత రఘు బాబు, వరికల్లు బ్రహ్మయ్య, గోరంట్ల సంధ్యారాణి, అంబటి అపర్ణ, కంబాలపాటి నరసయ్య పాల్గొన్నారు.
అద్దంకి : హెచ్ఐవి, ఎయిడ్స్ భాదిత రోగులను ప్రేమించాలని, వారికి ఆత్మస్థైర్యాన్ని కలిగించాలని మున్సిపల్ చైర్మన్ ఇస్తేరమ్మ పేర్కొన్నారు. అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా హెల్ప్ టిఐ, ఎయిడ్స్ నియంత్రణ మండలి, వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పట్టణంలో అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు హెల్ప్ టిఐ పిడి బివి సాగర్ అధ్యక్షత వహించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి విద్యార్థినీ, విద్యార్థులతో హెచ్ఐవి, ఎయిడ్స్‌పై ప్రజలను చైతన్యపర్చే ర్యాలీని ఆర్ దేవసేన కుమారి ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాసులు మాట్లాడారు. విచ్చలవిడి శృంగారం వలన హెచ్ఐవి, ఎయిడ్స్ వ్యాప్తి చెందుతుందని అన్నారు. నేటికీ హెచ్ఐవి, ఎయిడ్స్ బాధితుల సంఖ్య పెరుగుతూ ఉందని అన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయమని అన్నారు. క్షణికావేశంలో, మాదకద్రవ్యాల మత్తు విచ్చలవిడి శృంగారానికి బానిసలు అవుతున్నారని పేర్కొన్నారు. పిహెచ్‌సి డాక్టర్ ఎన్ నవ్యరెడ్డి మాట్లాడుతూ హెచ్ఐవి, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా మందులు వాడుకోవాలని అన్నారు. పౌష్టికాహారం తీసుకుంటే ఆరోగ్యంగా, సుఖం ఉంటారని అన్నారు. హెల్ప్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బివి సాగర్ మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం సమన్వయంతో పనిచేసి క్షేత్రస్థాయిలో హెచ్ఐవి, ఎయిడ్స్ వ్యాధిపై చైతన్యం చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఓఆర్డబ్ల్యూ శ్రావణి, మల్లేశ్వరి, శివ పార్వతి, మున్సిపల్ వైస్ చైర్మన్, మున్సిపల్ మేనేజర్ బి శ్రీదేవి, మెప్మా సిఎంఎం బి ఫణికుమారి, మెడికల్ ఆఫీసర్ శ్రీనివాసరావు, ఐసిటిసి కౌన్సిలర్ జి రమేష్ బాబు, డాక్టర్ జయసింహ, డాక్టర్ మనోజ్ కుమార్, పిడి డేవిడ్ రాజు పాల్గొన్నారు.
కారంచేడు : ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా స్వర్ణ ఉన్నత పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు పిహెచ్‌సి ల్యాబ్ టెక్నీషియన్ బయ్య శంకర్ శుక్రవారం నిర్వహించారు. 8, 9, 10వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. హెచ్ఐవి, ఎయిడ్స్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎయిడ్స్‌కు నివారణ తప్ప మందులు లేవని అన్నారు. అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అనంతరం వ్యాసరచన పోటీల్లో ప్రధమ బహుమతి తాండ్ర భవిత, ద్వితీయ బహుమతి అమ్మిశెట్టి రాజు, తృతీయ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీహెచ్ఎస్ హెచ్‌ఎం సుబ్బారావు, ఉపాధ్యాయులు ఎల్‌కె ప్రసాద్, కమల్ పాల్గొన్నారు.