రూ.60లక్షల నిధులు దుర్వినియోగం : టిడిపి రాష్ట్ర కార్యదర్శి సాయిబాబు ఆరోపణ

Nov 30,2023 23:41

ప్రజాశక్తి – భట్టిప్రోలు
గత మూడేళ్ల కాలంలో ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ కింద గుర్తించిన పనులు చేయకుండానే రూ.60లక్షల నిధులు దుర్వినియోగం చేశారని టిడిపి రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా ఆరోపించారు. స్థానిక టిడిపి కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామంలో బిఎం డ్రైను, వెల్లటూరు ఛానల్, కనగాల అప్లోయెంటు మురుగు కాలువలో గుర్తించిన పనులు జరగకుండానే జరిగినట్లుగా బయట ఫోటోలు తీసి యం బుక్ రికార్డు నమోదు చేసి నిధులు స్వాహా చేశారని ఆరోపించారు. ఉపాధి పనులకు రాని వారి జాబు కార్డులను సేకరించి వారి అకౌంట్లో డబ్బును జమ చేసి తిరిగి మరల వారి నుండి నాయకుల సొంత ఎకౌంట్లకు జమ చేయించుకున్నట్లు వెలుగులోకి వచ్చిందని అన్నారు. వెల్లటూరు ఛానల్‌పై చినపులివర్రు చప్టా వద్ద నుండి ఐలవరం వరకు ఏడు పనులుగా గుర్తించి రూ.60లక్షలు అంచనా వేశారని, దీనికిగాను రూ.41.56లక్షలు పనిచేసినట్లు కూలీలకు జమ చేశారని తెలిపారు. 17132 పనిదినాలకు 3325మంది పని చేసే నట్లుగా నమోదు చేశారని అన్నారు. భట్టిప్రోలు మెయిన్ డ్రైన్, అద్దేపల్లి మురుగు కాలువలకు సంబంధించిన ఆరు పనులను గుర్తించి రూ.43.78లక్షలు అంచనా రూపొందించగా దానికి గాను 7936 పని దినాలు చేయాల్సి ఉండగా 1683 పని దినాలు చేసినట్లు నమోదు చేశారని అన్నారు. దీనికిగాను రూ.18.21లక్షలు చెల్లించినట్లు తెలిపారు. మొత్తం 13పనులకు రూ.1.04కోట్లను అంచినా వెయ్యగా దానిలో రూ.59.79లక్షలు ఎలాంటి పనులు చేపట్టకుండానే అధికారులు, ప్రజా ప్రతినిధులు, అధికార పార్టీ నాయకులు స్వాహా చేశారని ఆరోపించారు. వైసిపి పాలన అవినీతి మయమైందని అన్నారు. ప్రజాస్వామ్యంలో వ్యక్తుల స్వేచ్ఛకు భంగం కలిగే విధంగా కొందరు వైసీపీ నాయకులు టిడిపి నాయకుల ఫోన్లను హక్‌ చేసి మాట్లాడుకునే సంభాషణలను టాప్ చేశారని ఆరోపించారు. ఫోన్ నెంబర్లను ట్రాప్ చేసి సమాచారాన్ని చేపట్టాల్సిన హక్కు ఎవరికీ లేదని తెలిపారు. దీనిపై తగిన ఆధారాలతో మాజీ మంత్రి ఆనందబాబుతో కలిసి మరో రెండు రోజుల్లో సైబర్ క్రైమ్ అధికారులకు పిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకంలో జరిగిన లక్షల అవినీతి కుంభకోణానాన్ని కూడా ఇప్పటికే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు, కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించి బాధ్యతలపై చర్యలు తీసుకునేవరకు టిడిపి పోరాడుతుందని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకంలో అవినీతి జరగలేదని ఏ ఒక్కరైనా ముందుకు వచ్చి సమాధానం చెప్పగలరా అని ప్రశ్నించారు. అవినీతి జరిగినట్లు నిర్ధారించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కార్యక్రమంలో టిడిపి పట్టణ కార్యదర్శి కుక్కల వెంకటేశ్వరరావు, నాయకులు ఎడ్ల జయశిలరావు, కనపర్తి సుందర్రావు, సయ్యద్ సిరాజుద్దీన్, ఎర్రంశెట్టి కరుణ శ్రీనివాసరావు, అతిన బసవ పున్నయ్య, లెనిన్ ఉన్నారు.

➡️