కబ్జాదారుల్ని అరెస్టు చేయలని నీలం నాగేంద్రం డిమాండ్
ప్రజాశక్తి – అద్దంకి
స్థానిక పోలీసు స్టేషన్లో నమోదైన దళితుల భూ ఆక్రమణ కేసులో బాపట్ల ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణ డిఎస్పి ఏవి రమణ గురువారం దళిత నాయకులు సమక్షంలో విచారణ జరిపారు. తాళ్లూరు మండలం శివరాంపురం గ్రామానికి చెందిన ఆబోతు విమలమ్మకు చెందిన ఆక్రమణకు గురైన భూమిని పరిశీలించారు. అద్దంకి మండలం మోదేపల్లి సర్వేనెంబర్ 372/10లో 19సెంట్ల భూమిని 2017లో రూ.లక్ష యాభై వేలకు ఆబోతు విమలమ్మ కొనుగోలు చేసి రిజిస్టర్ చేయించుకున్నారు. కానీ రోడ్డు పక్కనే ఉన్న ఈ పొలంపై కన్నేసిన పక్క పొలానికి చెందిన ఆలోకం హరిబాబు, చిన్నమ్మాయి దళితుల భూమిని ఆక్రమించేందుకు కుట్ర చేశారు. ఈ భూమిలో పశువుల మేతపైరు దళితులు వేసుకోగా గత నెల రోజుల క్రితం దున్ని పంటను ధ్వంసం చేశారు. అప్పటి నుండి తాళ్లూరు పోలీసు స్టేషన్‌కు, అద్దంకి పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు చేసిన దళితులకు న్యాయం జరగలేదు. తమకు న్యాయం చేయాలని బాధితురాలు స్పందనలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అద్దంకి తహశీల్దారుకు కలెక్టరేట్ అధికారులు ఫిర్యాదును పంపి చేతులు దులుసుకున్నారు. ఆ ఫిర్యాదుపై అద్దంకి తహశీల్దారు కార్యాలయం అధికారులు స్పందించలేదని బాధితురాలు ఆరోపించారు. తాను స్పందనలో పిర్యాదు చేసిన విషయం తెలిసిన భూ ఆక్రమణ దారుడు ఆలోకం హరిబాబు దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి ద్వారా దర్శి డిఎస్పికి ఫోనులో చెప్పించుకుని కేసు నమోదు కాకుండా చేశారని పేర్కొన్నారు. అద్దంకి వైసిపి ఇన్చార్జి కృష్ణ చైతన్య ద్వారా అద్దంకి పోలీసు స్టేషన్లో కూడా కేసు నమోదు కాకుండా చేస్తున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అద్దంకి తహశీల్దారు రిపోర్టు రావాలి, ఇది సివిల్ మ్యాటర్ అంటూ రెండు వారాలు కాలయాపన చేశారని ఆరోపించారు. ఈ విషయం తెలుసుకున్న దళిత నేత నీలం నాగేంద్రం చీరాల డిఎస్పి ప్రసాదరావుతో మాట్లాడారు. ఎస్సీ ఎస్టీ యాక్టు ద్వారా కేసు నమోదు చేయాలని అద్దంకి సీఐ రమేష్ బాబును కోరారు. బాధితురాలు ఆబోతు విమలమ్మకు చెందిన భూమి ఆక్రమణపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. ఈనెల 19న క్రైమ్ నెంబర్ 330/23 ఎస్సీ, ఎస్టీ కేసుగా నమోదు కావడంతో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ బాపట్ల ఎస్సీ, ఎస్టీ డిఎస్పి ఎవి రమణను విచారణ అధికారిగా నియమించారు. విచారణ నిమిత్తం వచ్చిన బాపట్ల డిఎస్పి ఆక్రమణకు గురైన దళితుల భూమిని పరిశీలించడమే కాకుండా నిందితులను కూడా పిలిపించి విచారించారు. సాక్షులను కూడా స్థానిక పోలీస్ స్టేషన్లో దళిత నాయకులు నీలం నాగేంద్రం, దారా అంజయ్య సమక్షంలో విచారించారు. ఈ కేసు విచారణలో బాపట్ల ఎస్సీ ఎస్టీ డిఎస్పి వెంట అద్దంకి రూరల్ ఎస్‌ఐ కె వెంకటేశ్వర్లు ఉన్నారు. దళితుల భూములు ఆక్రమిస్తే జైలుకు పంపిస్తామని బాపట్ల డిఎస్పి ఈ కేసులో నిందితులను హెచ్చరించారు.