తుఫాను హెచ్చరికలతో రైతుల్లో కలవరం

Dec 2,2023 00:54

ప్రజాశక్తి – ఇంకొల్లు
బంగాళా ఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారి రాబోయే మూడు రోజుల్లో కోస్తాంధ్రకు భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో పొగాకు, మిరప సాగు చేసిన రైతులు కలవరం చెందుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సాగు ఆరంభం నుండి రబీ సాగు ప్రారంభం వరకు సకాలంలో సరిపడా వర్షాలు పడక సాగు చేసిన వివిధ పంటలు ఎండుతూ, వాడుతూ వస్తున్నప్పటికీ రైతులు తమకు చేతనైన భగీరథ ప్రయత్నాలు చేసి పంటలు కాపాడుకుంటూ వచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి ట్యాంకర్లు, ఆయిల్ ఇంజన్ల ద్వారా నీటిని తరలించి మిరప, పొగాకు నాట్లు వేశారు. వేసిన నాట్లు ఎండు ముఖం పడుతున్నాయనుకున్న సమయంలో నవంబర్ నెల రెండో వారంలో కురిసిన వర్షం పంటలకు ఊపిరి పోసింది. దీంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఆలస్యంగానైన వైట్‌బర్లీ పొగాకు నాట్లు రబీ పంటగా శెనగ సాగు చేపట్టారు. ఇదిలా ఉంటే వర్షాభావ ప్రభావంతో నీరు అందుబాటులో లేకపోయినా దూర ప్రాంతాల నుంచి, వాగులు, కుంటల నుంచి నీరు ఆయిల్ ఇంజన్లు, ట్యాంకర్ల ద్వారా తరలించి ముందస్తు పొగనాట్లు వేశారు. మిరపకు తడులు ఇచ్చిన రైతులు తుఫాను హెచ్చరికతో ఆందోళన చెందుతున్నారు. ముందస్తు నాట్లతో బర్లీ పొగాకు తోటలు ఇప్పటికే ఏపుగా పెరిగాయి. నీరు కట్టిన ముదురు మిరప తోటలు కొన్ని కాపు దశకు వచ్చాయి. కొంత మంది మిరప పొలాలు అడుగుకాపు ఇప్పటికే కాశాయి. వర్షాలు ఎక్కువగా పడితే ఇప్పటికే అధికంగా పెట్టుబడి పెట్టిన ముదురు బర్లీతో పాటు కాపుగాచిన ముదురు మిరప తోటలో వర్షం దెబ్బకు ఉరక ఎత్తే ప్రభావం ఉందని పొగాకు ఆకులు దెబ్బ తినడంతో పాటు మిరపకాయలు రంగు మారే అవకాశం ఉందని వాపోతున్నారు.
ఈపాటికి దెబ్బతిన్న పొగ తోటలు
నవంబర్లో కొన్ని ప్రాంతాల్లో అధికంగా వర్షం పడిన పర్చూరు, యాదనపూడి, కారంచేడు మండలాల్లోని వివిధ గ్రామాల్లో ఇప్పటికే బర్లీ పొగ తోటలు దెబ్బతిన్నాయి. లోతట్టు పొలాల్లో తోటలు దెబ్బతిన్నాయి. రైతులు దెబ్బతిన్న పొలాల్లో మొక్కలు తొలగించి మళ్లీ వ్యవసాయం చేసి 2వసారి నాట్లు వేశారు.
పొగనారుకు గిరాకి
దెబ్బ తిన్న పొలాలలో మళ్లీ నాట్లు వేయటంతో పాటు పొగాకు దర ఆశాజనకంగా ఉండటంతో ఆలస్యంగానైనా విస్తీర్ణం పెరగటంతో పొగనారుకు అత్యంత గిరాకీ ఏర్పడింది. నారు మూట రూ.6వేలపైనే ధర పడుతుంది. ఇలా లేటైతే నారు ధర రూ.10వేలు అవుతుంది. వ్యవసాయం ఎరువులు నాటు ఖర్చు, పొలం కౌలు అన్నీ కలుపుకొని నాటు వేసేసరికి ఎకరాకు రూ.60వేల వరకు ఖర్చు అవుతుంది. ఉరకెత్తిన పొగ తోటలకు మళ్లీ నాటు వేయటంతో అదనంగా మరో రూ.15వేలు ఖర్చు. ఇంత ఖర్చు పెట్టినా తుఫాను ప్రభావం ఎలా ఉంటుందోనని రైతంగంలో కలవరం మొదలైంది.
మిరప రైతుల్లో బొబ్బర కలవరం
పొగాకు సాగు రైతు పరిస్థితి అలా ఉంటే మిరప రైతుల్లోను వర్షం కలవరంతో పాటు బొబ్బర తెగులుతో సతమతం అవుతున్నారు. అధిక ఖర్చులు పెట్టి నీటి తడులు ఇచ్చి ఎరువులు వేసి సస్యరక్షణ చేపట్టి ఇప్పటి వరకు పంటలు కాపాడుకుంటూ వచ్చిన మిరప రైతుకు బొబ్బర తెగులు వెంటాడుతుంది. కొంత మంది రైతులు ఈ పాటికే బొబ్బర తెగులు సోకటంతో మిరప మొక్కలు పీకి వేస్తున్నారు. ఖర్చుపెట్టి నష్టపోతామని ఇప్పుడే పీకి వేస్తే శనగ, పొగాకు సాగు చేపడితే పెట్టిన పెట్టుబడిలో కొంతైనా దక్కుతుందని ఆలోచిస్తున్నారు. మారిన వాతావరణం ప్రభావంతో కొంత మంది మిరప తోటల్లో రోజురోజుకు బొబ్బర తెగులు ఎక్కువ అతుందని ఆవేదన చెందుతున్నారు. తెగులుకు తోడు వర్షాలు అధికంగా పడితే మిరప తోటలు ఉరకెత్తడంతో పాటు కాపు కొచ్చిన కాయలు రంగు మారి తాలుగా మారే అవకాశం ఉందని ఆవేదన చెందుతున్నారు. వర్షాలు కురిసి ఫైరులు బాగా ఉందనుకున్న సమయంలో తుఫాను హెచ్చరికలు, బొబ్బర తెగులు ఉధృతి రైతులకు నిద్రలేకుండా చేస్తున్నాయి.

➡️