కార్డన్ అండ్ సెర్చ్ : డిఎస్పీ టి మురళీకృష్ణ

Nov 26,2023 02:03

ప్రజాశక్తి – రేపల్లె
చట్ట వ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చెయ్యడమే లక్ష్యంగా కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు డిఎస్పి టి మురళీకృష్ణ తెలిపారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు పట్టణం పోలీస్ స్టేషన్ పరిధిలోని నేతాజీ నగర్‌లో డిఎస్పి టి మురళీకృష్ణ సారధ్యంలో సబ్ డివిజన్ పోలీస్ అధికారులు, సిబ్బంది, సెబ్ అదికారులు సంయుక్తంగా కార్డన్ అండ్ సెర్చ్ శనివారం నిర్వహించినారు. పట్టణ సిఐ నజీర్ బేగ్, పట్టణ ఎస్ఐలు, నగరం, నిజాంపట్నం, వేమూరు, కొల్లూరు, భట్టిప్రోలు పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు, రేపల్లె సెబ్ అధికారులు, రేపల్లె సబ్ డివిజన్ పరిధిలోని 78మంది పోలీస్ సిబ్బంది సరైన పత్రాలు లేని 22 ద్విచక్ర వాహనాలను, ఒక ఆటోను సీజ్ చేశారు. ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ చట్టవ్యతిరేక, ఆసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేసే ఉద్దేశంతో నేతాజీ నగర్లో నివాసం వుంటున్న కొత్త వ్యక్తులను విచారించారు. వారి వివరాలను సేకరించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినారు. కొత్తవ్యక్తుల సమాచారాన్ని 100, 112లకు ఫోన్‌ చేసి చెప్పాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు.


చీరాల : ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ పి మహేష్ సూచనలతో డిఎస్పి ప్రసాదరావు పర్యవేక్షణలో టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామనగర్‌లో ట్రైనీ డిఎస్పి టి విద్యాశ్రీ, టూ టౌన్ సిఐ జి సోమశేఖర్, 1టౌన్ సిఐ పి శేషగిరిరావు, సెబ్ సిఐ సోమయ్య సిబ్బందితో రామనగర్ పరిసర ప్రాంతాలలో శనివారం కార్డన్ సర్చ్ నిర్వహించారు. టూ టౌన్ సిఐ సోమశేఖర్ మాట్లాడుతూ గంజాయి, నాటుసారా కట్టడికి పటిష్ట చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అందులో భాగంగా కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గంజాయి, నాటుసారా ఇతర అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చెయ్యడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. గతంలో రామనగర్ పరిసర ప్రాంతాలలో నివాసముండే కొంతమంది నాటుసారా, గంజాయి క్రయ, విక్రయాలకు సంబంధించిన కేసులలో పట్టుబడినందున ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టి కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే పోలీస్ స్టేషన్‌కు గానీ, 100,112లకు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. సరైన పత్రాలు లేని 8ద్విచక్ర వాహనాలు, 4ఆటోలను సీజ్ చేసినట్లు తెలిపారు. నాటు సారా తయారీకి పులియబెట్టిన 150లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చేశారు. 4లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

➡️