ప్రజాశక్తి – భట్టిప్రోలు
మండలంలోని వెల్లటూరు పంచాయతీ కార్యాలయానికి ప్రస్తుతం సర్పంచులు లేకపోవడంతో ప్రజలు వివిధ రకాల పనులపై వచ్చి తిరిగి వెళుతూ నానా అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం ఉన్న సర్పంచ్ చౌటుర్ లక్ష్మి రాజీనామా చేయటంతో సర్పంచ్ పదవి ఖాళీ అయింది. రాజీనామా చేసి 20రోజులు గడుస్తున్నప్పటికీ ఉన్నతాధికారులు ఏ ఒక్కరికి బాధ్యతలు అప్పగించలేదు. దీంతో పంచాయతీలో జరగవలసిన వివిధ రకాల కార్యకలాపాలు నిలిచిపోతున్నాయని వాపోతున్నారు. గత పంచాయతీ ఎన్నికల్లో వెల్లెటూరు పంచాయతీ ఎస్టీ రిజర్వేషన్ అయ్యింది. దీంతో గ్రామంలోని టిడిపి, వైసిపి వర్గీయులకు సంబంధించిన ఎస్టీ వర్గాల వారు పోటీ చేస్తే ఇరువురికి ఆర్థిక భారం అవుతుందని, ఇరు పార్టీల నేతలు సమన్వయపరిచారు. రెండున్నరేళ్లు చొప్పున ఇరువర్గాలకు ఒప్పందం కుదుర్చారు. దీంతో తొలుత వైసిపి వర్గానికి చెందిన చౌటూరు లక్ష్మీ రెండున్నర సంవత్సరాలు అనంతరం ఉప సర్పంచ్‌గా ఉన్న బొజ్జ రవి మరో రెండున్నరేళ్ళు సర్పంచ్ పదవిలో కొనసాగే విధంగా ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం చౌదరి లక్ష్మి ఈనెల 10న సర్పంచి పదవికి రాజీనామా చేసి లేఖను ఎంపీడీఒకు అందజేశారు. దీనికి సంబంధించిన ప్రతులను జిల్లా పంచాయతీ అధికారులకు అందించారు. అయితే ఉప సర్పంచ్‌గా ఉన్న రవికి సర్పంచ్ బాధ్యతలు అప్పగించాల్సి ఉండగా ఆ మేరకు ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పంచాయతీలో నేటికీ సర్పంచి లేక జరగవలసిన కార్యక్రమాలు నిలిచిపోతున్నాయని పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
సర్పంచి పదవిపై సమన్వయ లోపం
వేల్లటూరు పంచాయతీకి మిగిలిన రెండున్నర సంవత్సరాల పాలన కొనసాగించేందుకు సర్పంచి పదవికై ఉప సర్పంచిగా ఉన్న బొజ్జ రవితో పాటు అదే సామాజిక వర్గానికి చెందిన మరో వార్డు సభ్యురాలు పోటీ పడుతున్నట్లు తెలిసింది. దీంతోఎవరు సర్పంచి పదవి కోసం ముందుకు వెళ్లాలనే కోణంలో ఆలోచించుకుంటూ కాలయాపన జరుగుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ప్రజల ఓట్లతో గెలుపొందిన సర్పంచి పదవికి రాజీనామా చేస్తే తదనంతరం ఉన్నతాధికారులు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి మరో మారు ఎన్నికలు జరిపి సర్పంచిని ఎన్నుకోవాల్సి ఉంది. కానీ 20రోజులు గడుస్తున్నప్పటికీ పంచాయతీలో ఉన్న ఉపసర్పంచికి తాత్కాలిక బాధ్యతలు అప్పగించటం గాని లేదా మరో మారు నోటిఫికేషన్ జారీ చేసి ఎన్నికల నిర్వహించడం కానీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో పాలన నిలిచిపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటే అప్పటివరకు ఉప సర్పంచికి తాత్కాలిక బాధ్యతలు ఇవ్వాల్సి ఉంది. ఆ మేరకు ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి గ్రామంలో నెలకొన్న అనిచ్చితి పరిస్థితి దృష్ట్యా సర్పంచి పదవిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి ఏ రామ్ కుమార్ మాట్లాడుతూ సర్పంచిగా లక్ష్మి రాజీనామా చేసిన విషయాన్ని ఉన్నతాధికారులు దృష్టికి తీసుకు వెళ్ళామని ఉన్నతాధికారుల నుండి తగిన ఆదేశాలు రావాల్సి ఉందన్నారు.