ప్రజాశక్తి – పంగులూరు
సిపిఎం సీనియర్ నాయకులు కామ్రేడ్ సరికొండ అంజమరాజు అంత్యక్రియలు గురువారం ఉదయం బయట మంజులూరు గ్రామంలో జరిగాయి. సిపిఎం నాయకులు, బంధువులు, స్నేహితులు ఆయనకు తుది వీడ్కోలు పలికారు. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే బంధువులు బయట మంజులూరులోని ఆయన స్వగృహానికి చేరుకున్నారు. సిపిఎం బాపట్ల జిల్లా కార్యదర్శి సిహెచ్ గంగయ్య, జిల్లా నాయకులు రాయిని వినోద్ బాబు, సిపిఎం కొరిశపాడు మండల కార్యదర్శి మొండ్రు ఆంజనేయులు, మండల నాయకులు గుడిపాటి మల్లారెడ్డి, పాలపర్తి ఏలియా, సరికొండ రామచంద్రరాజు, పూసపాటి సుబ్బరాజు, సరికొండ లక్ష్మణ్ రాజు తదితరులు అంజమరాజు మృతదేహంపై ఎర్రజెండా కప్పి జోహార్లు అర్పించారు. వైసిపి బీసీ సెల్ పంగులూరు మండల కన్వీనర్ చక్రవరం భాస్కర్ రాజు, బట్రాజు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ చక్రవరం జ్యోతి, తదితరులు అంజమరాజు మృతదేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియలు నిమిత్తం మృతదేహాన్ని స్మశాన వాటికకు తరలించారు. దారి పొడవునా సిపిఎం నాయకులు, కార్యకర్తలు కామ్రేడ్ అంజమ రాజు జోహార్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు.