ప్రజశక్తి – చీరాల
కుందేరులో అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు ఈనెల 19న స్పందనలో ఇచ్చిన ఫిర్యాదుపై పూర్తి విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఎం, ప్రజావేదిక, వివిధ ప్రజాసంఘాల నాయకులు ఆర్డీఒ కార్యాలయంలో బుదవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతు కుందేరు ఆక్రములపై ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించి స్పందన ఇంచార్జ్ డిఆర్ఓ వెంకటరమణ సుప్రీంకోర్టు గైడెన్స్, జీఒ నెంబర్ 188 ప్రకారం నీటిపారుదల వనరైన కుందేరు దురాక్రమణదారులపై చర్యలు తీసుకొని, అక్రమంగా నిర్మాణం చేస్తున్న కట్టడాలను ప్రభుత్వ నిధులతో రెండు బుల్ట్రోజర్లతో తొలగించి రిపోర్టు సబ్మిట్ చేయమని 7రోజులు గడువు ఇచ్చారని అన్నారు. రెండు రోజుల్లో చర్యలు తీసుకోమని డిఆర్ఓ ఆర్డీఒకు చెప్పినట్లు తెలిపారు. అయినప్పటికీ చర్యలు తీసుకోలేదని అన్నారు. ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయని అన్నారు. అక్రమ నిర్మాణాలు తొలగించకుంటే ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. న్యాయ పోరాటం చేయాల్సి వస్తుందని అన్నారు. ఆర్డిఓ కార్యాలయాన్ని దిగ్బంధం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో ప్రజావేదిక నాయకులు గుమ్మడి ఏసు రత్నం, సిపిఎం కార్యదర్శి ఎన్ బాబురావు, చేతి వృత్తుల సంఘం పార్టీ నాయకులు శీలం వెంకటేశ్వర్లు, కెవిపిఎస్ అధ్యక్షులు లింగం జయరాజు, దోగుపర్తి కృష్ణ, సిపిఐ నాయకులు బత్తుల శామ్యూల్, దుడ్డు భాస్కర్, దుడ్డు విజయ్ సుందర్, ఎరుకల హక్కుల పోరాట సంఘం నాయకులు కుమార్ పాల్గొన్నారు.