ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్ : కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 27, 28 తేదీల్లో విజయవాడలో తలపెట్టిన మహాధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రెడ్డి వేణు, పి.రాము మండలంలోని పలు గ్రామాల్లో గురువారం ప్రచారం, సభలు సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కరించకుండా కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి ధరలను పెంచి, వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసి, పంటలకు గిట్టుబాటు ధర లేకుండా చేస్తున్న బిజెపి విధానాలను ప్రజలంతా వ్యతిరేకించాలని, ప్రజా పోరాటాలు, ప్రజాతంత్ర హక్కులపై దాడి ధర్నాలు నిరసనలపై నిర్బంధాన్ని ప్రజలంతా ఖండిస్తూ పోరాడాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక, రైతు సంఘాలు ఈనెల 27, 28న విజయవాడ జింఖానా గ్రౌండ్లో మహాధర్నా చేపట్టాలని, ఈ ధర్నాలో రైతులు, కార్మికులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలు మతోన్మాద విచ్ఛన్నకర చర్యలను ఖండించాలని, కార్మిక రైతు సంఘాల సమన్వయ కమిటీ పిలుపు మేరకు మండలంలోని నర్సిపురం, వెంకంపేట, ములగ, బొండపల్లి తదితర గ్రామాల్లో, సమావేశాలు జరిపి ప్రజలు చలో విజయవాడకు రావాలని కోరారు.