ప్రజాశక్తి-విజయనగరం : ఓటరు చేర్పులు, మార్పులకోసం డిసెంబర్ 2,3 తేదీలలో ప్రత్యేక కాంపెయిన్ జరుగుతుందని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. బుధవారం రాజకీయ పక్షాల ప్రతినిధులతో కలెక్టర్ సమ్మరీ రివిజిన్ పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డిసెంబర్ 2,3 తేదీలలో బూత్ స్థాయిలో స్పెషల్ కాంపెయిన్ నిర్వహిస్తామన్నారు.ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు బిఎల్‌ఒలు బూత్ వద్ద ఉంటారని,జాబితాలను సారి చూసుకోవాలని తెలిపారు. ఈనెల 22 నుండి 28 వరకు వారం రోజుల్లో ఫారం 6 లు చేర్పుల కోసం 3516 , ఫారం 7 తొలగింపుల కోసం 3433 , ఫారం 8 కరెక్షన్ కోసం 3679 మొత్తం 10628 దరఖాస్తులు అందాయని తెలిపారు. 18, 19 ఏళ్ళ వయసు గల ఓటర్ల తక్కువ సంఖ్యలో ఉన్నందున 17 ఏళ్లు నిండిన వారందరినీ ఓటర్లు గా చేర్పించేందుకు అన్ని కళాశాలల ప్రిన్సిపాళ్లతో వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడడం జరిగిందని తెలికిపారు. వారి నుండి స్పందన బాగుందని తెలిపారు. ఓటర్లకు 1 లక్ష 3 వేల ఎపిక్ కార్డులను జనరేట్ చేసినట్లు తెలిపారు. ఇప్పటికే చాలా వరకు డిస్పాచ్ చేసామని తెలిపారు. ఈ రెండు రోజులు పాటు నిర్వహించే ప్రత్యేక క్యాంపెయిన్‌ను ఓటర్లంతా వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. సమావేశంలో డిఆర్‌ఒ అనిత, ఇఆర్‌ఒలు వెంకటేశ్వరరావు, దొర, వైసిపి నుండి రొంగలి పోతన్న, టిడిపికి చెందిన కిమిడి నాగార్జున, ఐవిపి రాజు, ఆప్ ప్రతినిధి దయానిధి, బిఎస్‌పి నుండి సోములు , కాంగ్రెస్ నుండి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.పారదర్శకతతో ఓటర్ల వెరిఫికేషన్ చేయాలి : టిడిపి విజయనగరం కోట : జిల్లాలో ఓటర్ల వెరిఫికేషన్ పూర్తి స్థాయిలో పారదర్శకతతో చేయాలని, మరణించిన వారి ఓట్ల తొలగింపు, డబుల్ ఎంట్రీలు, వలసవెళ్లిన వారి ఓట్లను పూర్తిగా తొలగించాలని టిడిపి నాయకులు కలెక్టర్ నాగలక్ష్మిని కోరారు. ఈమేరకు బుధవారం టిడిపి విజయనగరం పార్లమెంట్ అధ్యక్షులు కిమిడి నాగార్జున, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు కొండపల్లి అప్పలనాయుడు , కోళ్ల లలిత కుమారి, కర్రోతు బంగార్రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు కలెక్టర్‌కు వినతినిచ్చారు. ఇదే అంశంపై విజయనగరం నియోజకవర్గం తరపున పార్టీ ప్రధాన కార్యదర్శి ఐ వి పి రాజు, పార్టీ కార్యాలయ కార్యదర్శి రాజేష్ బాబు కూడా వినతినిచ్చారు.