హింసకు వ్యతిరేకంగా పూలే స్ఫూర్తితో పోరాడుదాం

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :   హింస వ్యతిరేక పక్షోత్సవాల సందర్భంగా ఐద్వా ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌ నుంచి ప్రజాసంఘాల కార్యాలయం వరకు మహిళలు ర్యాలీ నిర్వహించారు. మహిళలపై జరిగే దాడులను, నేరాలను అరికట్టాలని, అందుకోసం ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయాలని, హక్కులు కాపాడాలని, మహిళా రక్షణచట్టాలు పటిష్టంగా అమలు చేయాలని, మహిళా రిజర్వేషన్‌ బిల్లును వచ్చే ఏడాది నుంచే అమలు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం ఎన్‌పిఆర్‌ భవనంలో జరిగిన సదస్సులో ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు బి.ప్రభావతి మాట్లాడారు. మహిళలపై నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయని అన్నారు. మద్యం, గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగం, అమ్మకాలు పెరగడంతో నేరాలు కూడా పెరిగిపోతున్నా యని తెలిపారు. నేరాలకు కారణాలైన మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రభుత్వం విఫలమవుతోందన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు, చిన్నారులపై నేరాలు పెరగడమే కాకుండా ప్రజాస్వామ్య హక్కులపై దాడి పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణ సంస్కరణలు వేగవంతంగా చేసి ఇంటి పన్నులు, చెత్త పన్ను లు, ఆస్తి పన్నులు పెంచుతున్నారని, మహిళలపై మరింత ఆర్థిక పరమైన వత్తిళ్లు పెరుగుతున్నాయని అన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి ఈనెల 25 నుంచి డిసెంబర్‌ 10 వరకు పక్షోత్సవాల్లో భాగంగా సదస్సులు, సెమినార్లు, ర్యాలీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అంతకుముందు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వి.లక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి పి.రమణమ్మ, పట్టణ సహాయకార్యదర్శి జి.పుణ్యవతి. టి.కృష్ణమ్మ, కె.కుమారి, సిహెచ్‌ రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.

➡️