హామీలను శతశాతం అమలు చేశాం

Nov 30,2023 21:14

ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌  :   శతశాతం హామీలను అమలు చేయడం ద్వారా, ప్రజలకు ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహనరెడ్డి నిలబెట్టుకున్నారని రాష్ట్ర శాసనసభ డిప్యుటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి కొనియాడారు. అన్ని వర్గాల అభ్యున్నతే ముఖ్యమంత్రి ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. మండలంలోని దుప్పాడ గ్రామంలో కొత్తగా నిర్మించిన సచివాలయం, వైఎస్‌ఆర్‌ విలేజ్‌ క్లీనిక్‌ భవనాలను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కోలగట్ల మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు వచ్చే జనవరి నుంచి అవ్వా తాతలకు ఇచ్చే పెన్షన్‌ రూ.3వేలకు పెరుగుతోందని చెప్పారు. పట్టణంలో ప్రధాన రోడ్లను విస్తరించి, లైటింగ్‌ సదుపాయాన్ని ఏర్పాటు చేశామని, జంక్షన్లను అభివద్ది చేశామని చెప్పారు. సుదీర్ఘ కాలంగా విజయనగరం ప్రాంత ప్రజలు అశోక్‌ గజపతిరాజుకు అధికారాన్ని ఇచ్చినప్పటికీ, ఆయన ఈ ప్రాంతానికి గాని, ఈ జిల్లా గానీ చెప్పుకోదగ్గ పని ఒకటి కూడా లేదని విమర్శించారు. దుప్పాడ గ్రామంలో చేపట్టిన అభివద్ది కార్యక్రమాలను వివరించారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తూ రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థను ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అవినీతి రహితంగా అందుతున్నాయన్నారు. ఒక్క దుప్పాడ గ్రామంలోనే వివిధ సంక్షేమ కార్యక్రమాల క్రింద సుమారు రూ.22 కోట్ల నగదును నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి జమ చేశారని తెలిపారు. కార్యక్రమంలో డిసిఎంఎస్‌ మాజీ అధ్యక్షులు కెవి సూర్యనారాయణ రాజు, ఎంపిపి మామిడి అప్పలనాయుడు, జెడ్‌పిటిసి కెల్ల శ్రీనివాసరావు, ఎంఎసి చైర్మన్‌ నడిపేన శశి భార్గవి, జొన్నవలస పిఎసిఎస్‌ అధ్యక్షులు కెల్ల త్రినాధ్‌, ఎంపిటిసి కెల్ల కృష్ణవేణి, దుప్పాడ సర్పంచ్‌ కరుమజ్జి లక్ష్మి, కరుమజ్జ రాములప్పడు, ఎంపిడిఒ గంటా వెంకటరావు, వైసిపి నాయకులు, మండలంలో గల ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

➡️