సిబ్బందితోనే వైద్య సేవలు

ప్రజాశక్తి- రేగిడి : మండలంలోని మునకలవలస పంచాయతీ పరిధి బాలకావి వలస గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్‌ ప్రోగ్రాం కార్యక్రమంలో భాగంగా బూరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి వైద్యాధికారి చలమయ్య గైర్హాజర్‌తో దిగువ స్థాయి సిబ్బందితోనే వైద్య సేవలు అందించడం పట్ల గ్రామస్తులు విమర్శిస్తున్నారు. ఈ గ్రామంలో 980 మంది జనాభా ఉన్నారు. బూరాడ ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలంటే 11 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. నెలలో 4వ మంగళవారం ఈ గ్రామానికి 104 ఆరోగ్య సేవలు అందవలసి ఉంది. బూరాడ పీహెచ్‌సి వైద్యులు వైద్య సేవలు అందించవలసి ఉన్నప్పటికీ ఆయన గైర్హాజర్‌తో పారంపేటకు చెందిన ఎంపిహెచ్‌ఒ సౌజన్య, ఏఎన్‌ఎం పుణ్యవతి, హెల్త్‌ అసిస్టెంట్‌ హరి, 104 డిఇఒ సత్యనారాయణ మాత్రమే వైద్య సేవలు అందిస్తున్నారని గ్రామస్తులు డోల చిన్నంనాయుడు, సరోజనమ్మ, సావిత్రి, తదితరులు తెలిపారు. కిలారి వెంకట నాయుడు, అప్పమ్మ బెడ్‌ రెడిట్‌లో ఉండడంతో వారిని వైద్యాధికారి దగ్గరుండి చూడాల్సిన పరిస్థితి ఉంది. డాక్టరు గైర్హాజర్‌తో పూర్తిస్థాయి వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నట్లు వారు తెలిపారు. డాక్టర్‌ రాకుంటే దిగువ స్థాయి సిబ్బందితో వైద్యం చేసుకుంటే ఇబ్బందులు పడతామని కొంతమంది రోగులు వెళ్లడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు ఫిర్యాదు మేరకు ప్రజాశక్తి ఉదయం10 గంటల నుంచి మధ్యాహ్నం 1.24 గంటల వరకు గ్రామంలో ఉండి వైద్య సేవలపై ఆరా తీసింది. అప్పటికి పూర్తిస్థాయిలో వైద్యులు రాకపోవడంతో జ్వరాలు, అతిసార సోకిన రోగులు రాజాం ప్రైవేటు ఆసుపత్రికి వెళ్ళి చేతి చమురు వదిలించుకోవలసిన పరిస్థితి నెలకొందని గ్రామస్తులు చెబుతున్నారు. బూరాడ వైద్యాధికారి చలమయ్య పనితీరుపై గ్రామస్తులు మండి పడుతున్నారు. అక్కడ దిగువ స్థాయి వైద్య సిబ్బందిని డాక్టర్‌ వచ్చారా.. రాలేదా.. అని ఆరా తీస్తే ఏమి చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. వాస్తవంగా ఫ్యామిలీ డాక్టర్‌ ప్రోగ్రాంలో భాగంగా ఇంటింటి కార్యక్రమం నిర్వహించి వైద్య శిబిరానికి రోగులను తీసుకురావాల్సి ఉంది. సిబ్బంది ఇంటింటికి తిరిగి రోగులను శిబిరం వరకూ తీసుకొచ్చినా డాక్టర్‌ రాకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. సిబ్బందే కొంత మందికి తెలిసీ తెలియని మందులు ఇచ్చి కార్యక్రమాన్ని మమా అని పించారు. వైద్యులు రాకపోవడంతో 980 జనాభాకు కేవలం 53 మందే వైద్య సేవలు వినియోగించు కున్నారు. ఇప్పటికైనా వైద్యులు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించకుంటే, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని కొంతమంది గ్రామస్తులు ముందుకు వచ్చారు. వైద్య సేవలందించడానికి హాజరు కాని పిహెచ్‌సి వైద్యులు చలమయ్యపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

➡️