శనగ వైపు రైతు చూపు

ప్రజాశక్తి – చిలకలూరిపేట : సాగు నీటి కరువు నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలపై రైతుల దృష్టి మళ్లింది. నీటి అవసరం తక్కువగా ఉండే, మంచు చెమ్మతో బతగ్గలిగే పంటల సాగును రైతులు పెంచారు. ఈ కోవలోనే శనగ సాగుపై ఆసక్తి చూపుతున్నారు. చిలకలూరిపేట మండలంలో 17 వేల ఎకరాల వరకూ సాగు భూమి ఉండగా గతేడాది 2 వేల ఎకరాలకుపైగా ఎర్ర (ఉప్పు) శనగ పంటను సాగు చేశారు. ఈ ఏడాది మరో వెయ్యి ఎకరాల వరకూ ఈ సాగు పెరిగే అవకాశం ఉందని అధికా రులు చెబుతున్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లోనూ ఈ పంటను కొద్ది మొత్తంలో అయినా సాగు చేస్తుండగా పసుమర్రులో అధికంగా సాగవుతోంది.సాధారణంగా ప్రతి సీజన్‌లోనూ నవంబర్‌ చివరి వారం నుండి డిసెంబర్‌ మొదటి వారంలోగా శనగ పంట సాగు చేస్తుంటారు. మూడు నెలల్లో పంట చేతికొస్తుంది. శనగ సాగును ప్రారంభించేలోగా మొక్కజొన్న, నూగులు, జ్యూట్‌ తదితర పంటలు వేసుకోవడానికి అవకాశం ఉన్నా ఎక్కువ మంది రైతులు సాగు చేయడం లేదు. రైతులైనా, కౌలురైతు లైనా తమ పొలాలను ఖాళీగానే పెడుతున్నారు. నీటి ఎద్దడి ఎందుకు ఒక కారణంగా కాగా వారిని ఇతర పంటల సాగుకు ప్రోత్సహించడంలో అధికారుల వైఫల్యం మరో కారణంగా తెలుస్తోంది.గతేడాది శనగ పంట ఎకరాకు 8 నుండి 12 క్వింటాళ్ల వరకూ దిగుబడి వచ్చింది. గతేడాది మద్దతు ధర రూ.5,630 ఉండగా ఈ ఏడాది రూ.6,200 వరకూ ఉంది. అయితే గతేడాది ప్రైవేటు మార్కెట్‌ లో రూ.ఐదారు వేల వరకూ ధర పలికింది. ఎకరా శనగ పంట సాగుకు 40 కిలోల విత్తనాలు అవసరం. ప్రస్తుతం కిలో విత్తనాల ధర బహిరంగ మార్కెట్‌లో రూ.80-90 వరకూ ఉండగా రైతు భరోసా కేంద్రాల ద్వారా రూ.48.60కు అందిస్తున్నారు. విత్తన ఖర్చు మొత్తంగా రూ.2 వేల నుండి రూ.3600 వరకూ ఉంటుంది. దుక్కిలో రెండు ఎరువుల బస్తాలు వేయాల్సి ఉంటుంది. అవసరం అనుకుంటే తేలికపాటి పురుగు మందులు పిచికారీ చేసుకోవచ్చు. కౌలు రూ.10 వేలుంటుంది. మొత్తంగా రూ.17 వేల వరకూ పెట్టుబడి ఖర్చులవుతాయి. అనుకున్న విధంగా పంట పండితే ఖర్చులుపోను ఎకరాకు ఖర్చులు పోను రూ.40 వేలు మిగిలే అవకాశం ఉంటుంది. పంటను చిలకలూరిపేటలోని మార్కెట్‌ యార్డులో మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేస్తారు.అయితే పత్తి, మిర్చి పంటలు సాగు చేసి, అన్నీ అనుకూలిస్తే ఎక్కువ మొత్తంలో రాబడులు ఉంటాయనే ఉద్దేశంతో శనగ తరహా ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు దూరంగా ఉంటున్నారనే వాదనా ఉంది. ఈ నేపథ్యంలో వారిలో అవగాహన పెంచి తక్కువ ఖర్చుతో మంచి రాబడులు పొందే పంటల సాగుకు ప్రోత్సహించాలని పలువురు కోరుతున్నారు.

➡️