ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : వైసిపి ఎన్నికల దారిలో రహదారి కుదుపులు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇవి ఓట్ల రూపంలో ఆ పార్టీకి నష్టం చేకూర్చే ప్రమాదం కూడా కనిపిస్తోంది. తాజాగా రాజాం నియోజకవర్గంలో జరిగిన సంఘటన విజయనగరం ఉమ్మడి జిల్లాలో రహదారి సమస్యలు మరోసారి తెరపైకి వచ్చాయి. వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినప్పటికీ అభివృద్ధి, మౌలిక సదుపాయాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదనేది జనం నుంచి వినిపిస్తున్న మాట. అందుకు తగ్గట్టే జిల్లాలోని రహదారులు కూడా అధ్వానంగా ఉన్నాయి. రాజాం – డోలపేట మధ్య రహదారి అస్తవ్యస్తంగా మారింది. చిన్నపాటి చినుకులు పడినా వాహనాలే కాదు, కాలినడకకు కూడా ఆటంకంగా మారుతోంది. అనేక సార్లు ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. ఇదే రహదారిలో చెరకు లోడుతో సంకిలి వెళ్తున్న లారీ కూరుకుపోయింది. ట్రాఫిక్ స్తంభించింది. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న స్థానిక ఎమ్మెల్యే కంబాల జోగులను ప్రజానీకం చుట్టుముట్టి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి నుంచి వెంటనే వెళ్లకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించడంతో ఆయన ద్విచక్ర వాహనంపై వెళ్లాల్సివచ్చింది. దీంతో పాటు రాజాం పట్టణంలోని రహదారి విస్తరణ పనులపైనా జనం ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యంగా అంబేద్కర్ కూడలి నుంచి జిఎంఆర్ ఐటి ప్రాంగణం వరకు, బొబ్బిలి రహదారి జంక్షన్ నుంచి గాయిత్రీ కాలనీవరకు రహదారి విస్తరణ పనులు చేపట్టాలని చాలా కాలం క్రితమే నిర్ణయించారు. రూ.20కోట్లతో తలపెట్టిన ఈ పనులకు జిల్లాకు చెందిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శంకుస్థాపన కూడా చేశారు. తీరా ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించక పోవడంతో పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో, రహదారులు అధ్వానంగా ఉన్నాయి. వేపాడ మండలంలో సోంపురం జంక్షన్ నుంచి ఆనందపురం కూడలి వరకు 16కిలోమీటర్ల రోడ్డు పనులు ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా పూర్తి చేయలేదు. ఈ రహదారిలో క్వారీ లారీలు అధిక లోడుతో తిరగడం వల్ల రోడ్డు నిర్మాణానికి వేసిన మెటల్ తేలిపోతోంది. వీలుపర్తి రోడ్డు నుంచి కడకొండకు సుమారు కిలోమీటరు వరకు వేసిన పక్కా రోడ్డు బూడిదగా మారిపోయింది. నిధులు మంజూరైనట్లు చెప్పడమే తప్ప పనులు మాత్రం చేపట్టకపోవడంతో గిరిజన గ్రామాల ప్రజలకు రాకపోకలకు అవస్థలు పడుతున్నారు. ఇదే మండల ప్రధాన రహదారి నుంచి ఆతవ గ్రామానికి వెళ్లే రెండు కిలోమీటర్ల రోడ్డు పూర్తిగా శిథిలమైంది. ఎమ్మెల్యే గ్రాంట్ నుంచి నిధులు మంజూరు కావడంతో కాంట్రాక్టరు పని ప్రారంభించారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో పని నిలిపివేశారు. విశాఖపట్నం నుంచి శృంగవరపుకోట మీదుగా అరకు వెళ్లే హైవే నుంచి ముకుందపురం గ్రామానికి ఉన్న సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల మేర రోడ్డు గోతులమయమైంది. ప్రమాదకరంగా గోతులు ఏర్పడటంతో ఈ రోడ్డుపై ప్రయాణించడానికి ముకుందపురం, ఓబులయ్యపాలెం గ్రామస్తులు భయపడుతున్నారు. గజపతినగరం నియోజకవర్గంలోని గజపతినగరం, లోగిశ రోడ్డు కూడా చాలా కాలంగా అధ్వానంగా ఉంది. ఈ రహదారికి నిధులు మంజూరైన ప్పటికీ పనులు నత్తనడకన సాగడంతో ప్రజా ప్రతినిధులపైనా, అధికారులపైనా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు మన్యం జిల్లాలోని కురుపాం నియోజకవర్గంలో కొమరాడ – రాయగడ రోడ్డు కూడా వర్షాకాలంలో చెరువులను తలపిస్తోంది. రహదారిపై పొడవునా ఉన్న గ్రామాల ప్రజానీకం సిపిఎం ఆధ్వర్యాన నిత్యం నిరసన కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఓ సందర్భంలో రహదారిపై ఉబాలు పట్టి వరినాట్లు వేసినా పాలకుల్లో చలనం రాలేదు. దీంతో, ఈ రహదారిలో ఎప్పటికప్పుడు ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. ఎస్.కోట నియోజకవర్గం కొత్తవలస మండల కేంద్రంలో మూడు రోడ్లు జంక్షన్ గుంతల మయంగా మారింది. వర్షాలు పడినప్పుడు నీరు చేరడంతోపాటు మిగిలిన సమయంలో దుమ్ముదూళితో ప్రజలు అవస్థలు పడుతున్నారు. దీన్ని బాగు చేయాలంటూ ఇటీవల సిపిఎం ఆధ్వర్యాన స్థానికులు ధర్నా కూడా చేపట్టారు. వేపాడ గ్రామీణ ప్రాంతాల రహదారుల నిర్మాణాలకు గ్రహణం పట్టింది. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు నిలిపేశారు. రహదారి పనులు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో వాహన దారులకు, ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. అర్ధాంతరంగా పనులు నిలిపేసిన రోడ్లపై క్వారీ లారీలు, భారీ వాహనాలు రాకపోకలు సాగించడంతో రహదారులు ఛిద్రమవుతున్నాయి. దీంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో మిగిలిన నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉండడంతో రహదారులపై చూపిన నిర్లక్ష్యం వైసిపి వచ్చే ఎన్నికల్లో గట్టి దెబ్బతగిలే అవకాశం ఉందని పలువురు చర్చించు కుంటున్నారు.