ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : కాలజ్ఞాన స్ఫూర్తి ప్రదాత వీరబ్రహ్మేంద్రస్వామి కాంస్య విగ్రహాన్ని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు శుక్రవారం ఆవిష్కరించారు. నగరపాలక సంస్థ కార్యాలయం జంక్షన్‌లో విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రత్యేక పూజలు చేశారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వీరబ్రహ్మేంద్రస్వామి భక్తులు పాల్గొన్నారు. అనంతరం 4వ డివిజన్ కార్పొరేటర్ మారోజు శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి మాట్లాడుతూ భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు మార్గ నిర్దేశం చేస్తూ కాలజ్ఞానాన్ని రచించి మానవాళికి అందించిన గొప్ప శక్తివంతుడు వీరబ్రహ్మేంద్రస్వామి అని అన్నారు. విగ్రహ పరిసర ప్రాంతాలను అభివద్ధి చేసేందుకు కషి చేస్తామన్నారు నగరంలో అనేక ప్రాంతాలలో వివిధ వర్గాల కోరిక మేరకు విగ్రహాలను, వివిధ ఆకృతులను ఏర్పాటు చేశామన్నారు. నగరాన్ని మరింత ఆకర్షణీయంగా సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.జెడ్‌పి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో పీఠాధిపతి వీరధర్మజ స్వామి, నగర మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, వైసిపి నగర అధ్యక్షుడు ఆశపు వేణు, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ జానాప్రసాద్, కార్పొరేటర్ బొద్దూరు గోవిందమ్మ తదితరులు పాల్గొన్నారు.