ప్రజాశక్తి-విజయనగరం కోట : పచ్చని విశాఖను విధ్వంసం చేయడమే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారని టిడిపి జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున విమర్శించారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికే మూడు రాజధానుల నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చారని అన్నారు. సోమవారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి టిడిపి నాయకులకు ఇష్టం లేదంటూ వైసిపి నాయకులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అభివృద్ధిని తాము స్వాగతిస్తామని ,దాని పేరిట భూకబ్జాలు, దందాలు, సెటిల్‌మెంట్లు, ఫ్యాక్షన్ పాలనను ప్రశాంతతకు మారు పేరైన ఉత్తరాంధ్రకు, విశాఖకు తీసుకురావడాన్నే తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ఇంకా జగన్ ఇక్కడకు రాకముందే రుషికొండను బోడికొండగా మార్చారన్నారు. జగన్ పరిపాలన ఎటువంటిదో, రాష్ట్రం నుంచి పరిశ్రమలు ఇతర ప్రాంతాలకు ఎందుకు తరలిపోతున్నాయో అందరికీ తెలుసన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని తెలిపారు. విశాఖను ఐటి కారిడార్‌గా చంద్రబాబు అభివృద్ధి చేశారని.. జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే దానిని కొనసాగించవచ్చని హితవు పలికారు. నాలుగున్నరేళ్లు వదిలేసి.. ఎన్నికల ఏడాదిలో ఇక్కడ కాపురం పెట్టి ఏం సాధిస్తారని ప్రశ్నించారు. ఇప్పటి వరకూ చేయలేని అభివృద్ధిని ఈ ఆరు నెలల్లో ఎలా చేస్తారన్నారు. న్యాయస్థానం ఆదేశాలనూ గౌరవించకుండా మొండిగా వెళ్లడం సైకో జగన్‌కే సాధ్యమైందన్నారు. వాస్తవానికి విశాఖ పరిపాలన రాజధాని సాధ్యం కాదని వైసీపీ వారికీ తెలుసని.. కేవలం రాజకీయ లబ్ధి, ప్రజలను మభ్యపెట్టడానికే ఇదిగో, అదిగో అంటూ డ్రామాలాడుతూ.. ఇక్కడి తెలుగుదేశం నాయకులపై నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లాలో పరిశ్రమలు మూతపడటం, నిరుద్యోగ సమస్య అధికమవ్వడం ఇక్కడ నాయకులకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.