ప్రజాశక్తి-విజయనగరం : వి జయనగరం మండలం వేణుగోపాలపురం వద్ద సుమారు రూ.179 కోట్ల వ్యయంతో ప్రతిపాదించిన 220/132/33 కిలోవాట్ల విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి శంకుస్థాపన చేశారు. సిఎం తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో మంగళవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో స్థానిక ఒంటితాడి అగ్రహారం విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని డిప్యుటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, కలెక్టర్ నాగలక్ష్మి ఆవిష్కరించారు. ఈ సబ్ స్టేషన్ నిర్మాణం ద్వారా వివిధ రకాల విద్యుత్ సమస్యలు పరిష్కరించబడతాయి. రైతులకు, పారిశ్రామిక, వాణిజ్య, గహ అవసరాలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా జరుగుతుంది. ముఖ్యంగా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ సరఫరాకు ఈ సబ్ స్టేషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ సబ్‌స్టేషన్ వల్ల విజయనగరం, గజపతినగరం, బొండపల్లి, నెల్లిమర్ల, గుర్ల, గరివిడి మండలాలకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేయడమే కాకుండా, లో వోల్టేజీ సమస్య పరిష్కరించబడుతుంది. దీనిద్వారా గరివిడి ఉప కేంద్రానికి నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడమే కాకుండా, పెందుర్తి ఉపకేంద్రాలకు ప్రత్యామ్నాయంగా మారుతుంది.అభివృద్ధికి దోహదం : కోలగట్ల ఈ విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణం పూర్తయితే వ్యవసాయానికి పగటిపూటే 9 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతుందని శాసనసభ డిప్యుటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలను దష్టిలో పెట్టుకొని వేణుగోపాలపురం వద్ద నిర్మించ దలపెట్టిన 220 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ జిల్లా అభివృద్దికి మేలుమలుపుగా పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యుటీ మేయర్ లయా యాదవ్, జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంఎల్‌ఎన్ రాజు, మాజీ డిసిఎంఎస్ ఛైర్మన్ కెవి సూర్యనారాయణరాజు, ఎపిఇపిడిసిఎల్ ఎస్‌ఇ ఎం.లక్ష్మణరావు, ఎపి ట్రాన్స్‌కో ఎస్‌ఇ బి.కోటేశ్వర్రావు, పలువురు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, ఎఇలు, విద్యుత్ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.