ప్రజాశక్తి -పార్వతీపురం : విద్యారంగంలో నెలకొన్న స్థానిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ పోరుబాటు పట్టింది. శుక్రవారం స్థానిక ఆర్‌టిసి కాంప్లెక్సు వద్ద ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులు చేపట్టిన దీక్షలను యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి తోట రమేష్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ సిహెచ్ పావని ప్రారంభించారు. దీక్షలకు టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బోనెల విజయచంద్ర, యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.మురళీమోహన్ తదితరులు మద్దతు తెలిపారు. దీక్షలను ఉద్దేశించి ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పావని మాట్లాడుతూ ఈమాట్లాడుతూ విద్యారంగంలో విద్యార్థుల ఎదుర్కొంటున్న సమస్యలతో పాటుగా జిల్లాలో పిజి కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు విద్యావ్యవస్థ పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉన్నారని, జిల్లాల విభజన పట్ల ఉన్న శ్రద్ధ జిల్లాలో విద్యాభివృద్ధిపై లేవని విమర్శించారు. పార్వతీపురం జిల్లా కేంద్రంలో పిజి సెంటర్ లేకపోవడం చాలా అన్యాయమని, దీనివల్ల విద్యార్థులపై చదువులకై ఇతర ప్రాంతాలకు వెళ్లలేక చదువులు డిగ్రీ తోనే ఆపివేసే పరిస్థితి నెలకొందని అన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, మౌళిక సదుపాయాలు కల్పించకపోవడం చాలా దౌర్బాగ్యమని వాపోయారు. విద్యాశాఖ అధికారులు స్పందించి వెంటనే స్థానిక సమస్యలు పరిష్కరించాలని, లేదంటే పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. యుటిఎఫ్ నాయకులు తోట రమేష్ మాట్లాడుతూ విద్యావ్యవస్థను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అతలా కుతలం చేస్తున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్‌ఇపిని రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అమలు చేసి విద్యా వ్యవస్థను నాశనం చేస్తోందని అన్నారు. 117 జీవో ను రద్దు చేసి, పాఠశాలల విలీనం ఆపాలని డిమాండ్ చేశారు.దీక్షలకు మద్దతు తెలిపిన బోనెల విజయచంద్ర మాట్లాడుతూ ఈ సమాజాని మార్చే శక్తి ఒక్క విద్యార్థి యువతకే ఉందని, అందరూ ఐక్యంగా విద్యారంగ సమస్యల పరిష్కారానికి పోరాడాలని అన్నారు. పట్టణంలో మెరుగైన ఉన్నత విద్యాసంస్థలు లేకపోవడం చాలా దారుణమని, రాబోయే రోజుల్లో కచ్చితంగా పట్టణ విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.మురళీమోహన్ మాట్లాడుతూ విద్యాభివృద్ధి తోనే దేశం, ప్రాంతం అభివృద్ధి ముడిపడి ఉందని, అందుకోసం విద్యార్థులంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తు విద్యార్థుల పోరాటానికి ఉపాధ్యాయ సంఘం సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి.పండు, పి.రాజశేఖర్, నాయకులు అఖిల్, సిసింద్రీ, దేవిడ్, రవి, విద్యార్థులు పాల్గొన్నారు.