ప్రజాశక్తి- భోగాపురం : రాష్ట్ర వ్యాప్తంగా 45 పోలీస్స్టేషన్లను అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఇటీవల జిఒ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో మన జిల్లాకు చెందిన భోగాపురం, ఎస్‌కోట పోలీస్ స్టేషన్టను అప్‌గ్రేడ్ చేయనున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా ఎస్ఐ ఉండేవారు. ఇక నుంచి సిఐ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా కొనసాగనున్నారు. ఈ మేరకు సంబంధిత జిఒను జారీ చేసింది. ప్రస్తుతం భోగాపురం సర్కిల్ పరిధిలో భోగాపురం, డెంకాడ, పూసపాటిరేగ మండలాలు ఉండేవి. ఇటీవలి కాలంలో నెల్లిమర్లను కూడా ఈ సర్కిల్‌లోకి కలిపారు. నాలుగు మండలాలతో కలిపి సర్కిల్ కార్యాలయంగా కొనసాగుతోంది. అయితే ఇటీవలి అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన జరగడంతో పాటు నిర్మాణ పనులు శరవేగరంగా జరుగుతున్నాయి. అంతేకాక త్వరలో సిఎం క్యాంప్ కార్యాలయం కూడా విశాఖకు తరలివస్తుండడంతో విశాఖకు ఆనుకొని ఉన్న భోగాపురంపై ప్రత్యేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదివరకు ఎస్.ఐ కేసులు నమోదు చేసేవారు ఇక నుంచి సిఐ కూడా కేసులు నమోదు చేయనున్నారు. భోగాపురం పోలీస్‌స్టేషన్‌కు ఎస్.ఐ, సి.ఐ ఇక్కడే కొనసాగుతారు. ఇక డెంకాడ, నెల్లిమర్ల, పూసపాటిరేగ మండలాలు కలిపి ఒక సర్కిల్‌గా మారుతుంది. నెల్లిమర్ల నియోజకవర్గం కేంద్రం కావడంతో నెల్లిమర్ల పేరు మీద మరో సర్కిల్ కార్యాలయం వస్తుందని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం భోగాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్గా బివి. వెంకటేశ్వరరావు ఉన్నారు. ఈయనను ఇక్కడ కొనసాగిస్తారా లేదా కొత్తవారినెవరినైనా నియమిస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఎస్‌కోట విషయానికొస్తే ఇక్కడ అరకు, పాడేరు వంటి గిరిజన ప్రాంతాలు నుంచి గంజాయి ఎక్కువగా రవాణా జరుగుతోంది. ఇక్కడ ఈ కేసులే ఎక్కువగా నమోదు అవుతుంటాయి. ఇంకా ఇక్కడ పట్టణం అభివృద్ది చెందుతుండడంతో దీనిని అప్‌గ్రేడ్ చేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆయా పోలీస్ స్టేషన్లను అప్‌గ్రేడ్ చేసినట్లు కేవలం జిఒ మాత్రమే విడుదల చేసింది. ఇంకా సిఐల నియామకం, మిగిలిన స్టేషన్లను కలుపుకొని కొత్త సర్కిల్ కార్యాలయాలకు సంబంధించిన విధివిదానాలు త్వరలో అధికారులు ఖరారు చేస్తారని చర్చ జరుగుతోంది.