ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధిఉమ్మడి జిల్లాలో రబీ గట్టెక్కేదెలా అనే ప్రశ్న వెంటాడుతోంది. ప్రతి ఎకరాకూ సాగునీరు అందిస్తామని అధికార యంత్రాంగ ఇటీవల ప్రకటించింది. నీటి లభ్యతపైనా అంచనాలు వేసి ప్రణాళికలు తయారు చేశారు. రబీ సాగుకు, తాగునీటి అవసరాలకు 92 టిఎంసిలు అవసరం కాగా గోదావరిలో దశలవారీగా 82 టిఎంసిల నీరు అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు. అయితే అంతటి నీటి ప్రవాహం ఉంటుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితులతో గోదావరిలో నీటి ప్రవాహం అంతగా లేదు. ఏటా ఆగస్టు నుంచి అక్టోబరులో నీటి ప్రవాహాన్ని బట్టి రబీలో లభ్యతను అంచనా వేస్తారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యాయి. శివారు ప్రాంతాలకు సాగునీరు అందలేదు. పంట పొలాలు దెబ్బతిన్నాయి. పురుషోత్తపట్నం, పుష్కర పంప్‌హౌస్ 1, 2లను నిధుల కొరత వేంటాడుతోంది. రబీలో వంతుల వారీ విధానంతో గట్టెక్కవచ్చంటూ ముందుగానే ప్రణాళికలు వేసుకుంటున్నారు. అంచనాలు తలకిందులైతే పరిస్థితి ఏమిటనే ఆందోళన వెంటాడుతోంది. అధికారుల గణాంకాల ప్రకారం సీలేరు నుంచి 40 టిఎంసి నీరు లభించనుంది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా సీలేరు నుంచి ప్రతి ఏటా ఆ మేరకు నీటి లభ్యత ఉంటోంది. పోలవరం ప్రాజెక్ట్ వద్ద మరో 12 టిఎంసి నీరు అందుబాటులో ఉందని అంచనా వేశారు. మరో 25 టిఎంసిల గోదావరి ప్రవాహం ద్వారా అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులను దృష్ట్యా సకాలంలో నిధులు మంజూరు చేయకపోతే రబీ సాగుకు ఇబ్బంది పడే అవకాశం ఉంది. రబీ ముందస్తు సాగు చేపట్టి జనవరి మొదటి వారం నాటికే నాట్లు పూర్తి కావాలని అధికారులు సూచిస్తున్నారు. ఆ దిశగా ప్రణాళికాబద్ధంగా సాగు చేపట్టకపోతే చివరిదశలో పంట దెబ్బతినే అవకాశం ఉందనే హెచ్చరిక చేస్తున్నారు. గత అనుభవాల రీత్యా రబీలో పరిస్థితులు చేయి దాటిపోకుండా ఉండాలంటే అవసమైన చోట ఎత్తిపోతలను అమలు చేయాలి. కాలువల్లోనూ ఇంజన్‌లు ఏర్పాటు చేయాలి. స్లూయిజ్‌లు మరమ్మతులు చేయాలి. డ్రెయిన్‌లలో నీటిని వినియోగించు కోవాలి. కాలువలు, డ్రెయిన్‌లలో తూడు, గుర్రపు డెక్కను తొలగించేందుకు చర్యలు చేపట్టాలి. రెండేళ్లుగా ప్రభుత్వం ఇరిగేషన్ వ్యవస్థపై చిన్నచూపు చూస్తోంది. ఆశించిన స్థాయిలో నిధులు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. ఈ ఏడాది ప్రతిపాదనలు పంపే విషయంలోనే ప్రభుత్వం కట్టడి చేసిందని గణాంకాలు చెబుతున్నాయి. కొద్ది మొత్తంలోనే అంచనాలు రూపొందించాలంటూ జిల్లా అధికారులకు దిశా నిర్ధేశం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రబీలో సాగుకు కేవలం రూ.10 కోట్లు అవసరమవు తాయంటూ ప్రతిపాదనలు పంపారు. 2021లో ప్రభుత్వం రూ.63 కోట్లు మంజూరు చేసింది. 2022లో అధికారులు రూ.65 కోట్లు అంచనా వేయగా ప్రభుత్వం కేవలం రూ.10 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఐఏబి సమావేశం ముగిసి వారం రోజులు గడిచినా నేటికీ నిధులు మంజూరుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు.