యాంటీ బయోటిక్స్‌ వాడకంతో ముప్పు

 ప్రజాశక్తి-విజయనగరం   :  యాంటిబయాటిక్స్‌ వాడకంతో ముప్పు పొంచి ఉందని డిఎంహెచ్‌ఒ ఎస్‌.భాస్కరరావు అన్నారు. ప్రజలలో యాంటీబయటిక్స్‌ వాడకం ఎక్కువగా ఉండడంతో దీన్ని తగ్గించేందుకు ప్రజలకు అవగాహన కల్పించేందుకు శుక్రవారం జిల్లా వైద్యఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యాంటీ మైక్రోబయల్‌ రెసిస్టెన్స్‌ గురించి మాట్లాడారు. మనిషి శరీరంలో కంటికి కనిపించని సూక్షమైన బాక్టీరియా, వైరస్‌, పారాసైట్‌ లు, ఫంగస్‌ వంటి అనేకమైన సూక్ష్మ క్రిములు తిరుగుతూనే వుంటాయని అన్నారు. వీటిలో కొన్ని రోగ నిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి ఆహారంలో పోషకాలను శరీరం శోషించుకోడానికి బాక్టీరియ, వైరస్‌లు తోడ్పతుంటాయని తెలిపారు. అయితే ఈ మైక్రోబ్స్‌ కేవలం మేలు చేయడమే కాదు కొన్ని సందర్భాలలో కీడు కూడా చేస్తాయన్నారు. మైక్రోబ్స్‌ ఔషద నిరోధక శక్తిని కాలానుగుణంగా పెంచుకుంటాయన్నారు. అందువలన సహజ పద్దతిలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం చాలా అవసరమని తెలిపారు. యాంటీబయోటిక్స్‌పై ఆధారపడడాన్నితగ్గించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మైక్రో బయాలజిస్టు డాక్టర్‌ అరుణశ్రీ, క్షయ నివారణ అధికారి డాక్టర్‌ రాణి,ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాకాధికారి ఎన్‌. సూర్యనారాయణ, జిల్లా టీకా అధికారి డాక్టర్‌ ఆర్‌.అచ్యుతకుమారి, తదితరులు పాల్గొన్నారు.

➡️