ముంచేసిన వాన

 ప్రజాశక్తి -వేపాడ, శృంగవరపుకోట  :   మొన్నటివరకు తీవ్ర వర్షాభావం… రెండు రోజులుగా అకాల వర్షాలు రైతన్నలను అతలాకుతలం చేశాయి. అల్పపీడన ప్రభావంతో రెండు రోజులుగా జిల్లాలో చిరు జల్లులు, పలుచోట్ల వర్షాలు కురవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరికొద్దిరోజుల్లో ఇళ్లకు చేరాల్సిన పంట నీటి పాలు కావడంతో రైతన్నలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. గురు, శుక్రవారాల్లో కురిసిన వర్షాలతో జిల్లాలో సుమారు 2వేల ఎకరాల్లో కోసి ఉంచిన వరిచేలు నీటి పాలయ్యాయి. వేపాడ, శృంగవరపుకోట మండలాల్లోని పలు గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో వేపాడ మండలంలో పికెఆర్‌ పురం, ఎస్‌ఎస్‌ఆర్‌ పురం, అరిగిపాలెం, జాకేరు, వల్లంపూడి తదితర గ్రామాల్లో వందలాది ఎకరాల్లో వరి నీటమునిగింది. శృంగవరపుకోట మండలంలోని వెంకటరమణపేట, బొడ్డవర, జెడ్‌ కుమరాం, రాజీపోట, కాపు సోంపురం, చినఖండేపల్లి, భవానీనగర్‌, ముషిడిపల్లి, ఎస్‌.కోట, కొత్తూరు తదితర గ్రామాల్లో సుమారు 800 వందల ఎకరాల్లో కోసి ఉంచిన వరిచేలు నీట మునిగాయి. వరిపనలు పూర్తిగా మునిగిపోవడంతో వరిచేలు మరి పనికి రాకుండా పోయాయని రైతులు కన్నీరు పెడుతున్నారు. చేతికొచ్చిన పంట నీలు పాలు కావడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

➡️