ప్రజాశక్తి- బొబ్బిలి : మా భూములు మాకివ్వాలని బాడంగి మండలం హరిజన పాల్తేరు గ్రామానికి చెందిన దళిత రైతులు అలజంగి అలేషమ్మ, వై. రామారావు, వై. సుధ, అలజంగి సూరమ్మ, వై. గైరమ్మ, ఎ. యాదమ్మ, వై. వెంకయ్య ఆర్‌డిఒ ఎ. సాయిశ్రీని కోరారు. ఆర్‌డిఒ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందనలో తమ భూమి ఇప్పించాలని దరఖాస్తు ఇచ్చారు. కొన్నేళ్ల క్రితం తమకు ప్రభుత్వం ఒకొక్కరికి 1.80సెంట్లు చొప్పున ఏడుగురికి 12.60 ఎకరాలు ఇస్తే కోడూరు గ్రామానికి చెందిన అలమండ ఆనందరావు అక్రమించేసి రీసర్వేలో మా భూములను ఆయన పేరు మీద రాపించుకున్నారన్నారు. తమ భూమి తమకు ఇప్పించాలని కోరారు. తమ భూమి తమ పేరు మీద లేకపోవడంతో రైతు భరోసా, ఇతర రాయితీలు రావడం లేదన్నారు. రైతులకు న్యాయం చేయాలని శివడవలస సర్పంచ్ వి.నారాయణరావు కోరారు. దర్యాప్తు చేసి న్యాయం చేస్తామని రైతులకు ఆర్‌డిఒ సాయిశ్రీ హామీ ఇచ్చారు.