మహాధర్నాను జయప్రదం చేయండి

ప్రజాశక్తి-బొబ్బిలి  :  ఈ నెల 27, 28వ తేదీల్లో విజయవాడలో జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్యనారాయణ కోరారు. శుక్రవారం పట్టణంలోని వేణుగోపాలస్వామి మండపం వద్ద సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకరరావు అధ్యక్షతన సదస్సు ఏర్పాటుచేశారు. ఈ సదస్సులో ఆయనతోపాటు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌ మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో, రాష్ట్రంలో కార్మిక వర్గానికి తీవ్రంగా హాని చేస్తున్నాయన్నారు. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఏవీ లేకుండా వెట్టిచాకిరీ చేయించుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెడుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం దొరికిన కాడికి అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు, కార్మికులు ఐక్యమై మహాధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో అంగన్వాడీ యూనియన్‌ బొబ్బిలి ప్రాజెక్టు నాయకులు జె.కామేశ్వరి, బి.నిర్మల, ఆర్‌పిల యూనియన్‌ నాయకులు లతా, మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం నాయకుాలు రౌతు సత్యవతి, ఆశాల సంఘం నాయకులు లంక శాంతమ్మ కార్మికులు పాల్గొన్నారు.విజయనగరం టౌన్‌ : ఈనెల 27,28తేదీల్లో విజయవాడ జింఖానా మైదానంలో సిఐటియు ఆధ్వర్యాన చేపట్టిన మహాధర్నాకు తరలిరావాలని నగర కార్యదర్శి బి.రమణ పిలుపునిచ్చారు. శుక్రవారం కన్యకా పరమేశ్వరీ కోవెల జంక్షన్‌ లో భవన నిర్మాణ కార్మికులతో కలిసి వాల్‌పోస్టర్‌ విడుదల చేశారు. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు త్రినాథ్‌, తది తరులు పాల్గొన్నారు.

➡️