మహాకవి గురజాడకు నివాళి 

Nov 30,2023 21:16

 ప్రజాశక్తి-విజయనగరం కోట :     మహాకవి గురజాడ అప్పారావు 108వ వర్థంతి సందర్భంగా వివిధ రంగాల ప్రముఖులు గురువారం ఘనంగా నివాళులర్పించారు. గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో ముందుగా కవులు, కళాకారులు, పట్టణ ప్రముఖులు మహాకవి స్వగృహంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గురజాడ వాడిన వస్తువులతో స్వగహం నుంచి గురజాడ కాంస్య విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. మహాకవి రాసిన దేశభక్తి గేయాలను విద్యార్ధులు ఆలపించారు. గురజాడ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గురజాడ సాంస్కతిక సమాఖ్య అధ్యక్షులు పివి నర్సింహరాజు, ప్రధాన కార్యదర్శి కాపుగంటి ప్రకాష్‌, కోశాధికారి డాక్టర్‌ ఎ.గోపాలరావు మాట్లాడుతూ గురజాడ వర్ధంతి సందర్భంగా ప్రతి ఏటా ప్రముఖులకు గురజాడ విశిష్ట పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా డిసెంబర్‌ 3న ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్‌కు గురజాడ విశిష్ట పురస్కార ప్రదానం చేస్తామని తెలిపారు. ఆనందగజపతి కళాక్షేత్రంలో సాయంత్రం 6గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యు.దుర్గప్రసాద్‌, పురస్కార ప్రదాత కోలగట్ల వీరభద్ర స్వామి, చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో గురజాడ కుటుంబ సభ్యులు వెంకటేశ్వరప్రసాద్‌, ఇందిర, లలిత, గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్‌ రొంగలి పోతన్న, డాక్టర్‌ జక్కు రామకష్ణ, సాలూరు సంతోషి, అల్లంశెట్టి శ్రీనివాసరావు, లోగిశ లక్ష్మునాయుడు, ఈపు విజయకుమార్‌, మానాప్రగడ సాహితి, రత్నాల బాలకష్ణ, సూర్యలక్ష్మి, స్వరూప, హిమబిందు తదితర కవులు, కళాకారులు, ప్రముఖులతోపాటు శ్రీ త్యాగరాజ సంగీత నత్య కళానికేతన్‌, గురజాడ, సన్‌ స్కూల్‌ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఐద్వా ఆధ్వర్యాన…విజయనగరం టౌన్‌ : మహాకవి గురజాడ వెంకట అప్పారావు వర్ధంతి కార్యక్రమాన్ని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో ఎల్‌బిజి నగర్‌, జిసిసి సోప్‌ యూనిట్‌, ముచ్చువాని చెరువుగట్టు వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి పి . రమణమ్మ, ఉపాధ్యక్షులు వి లక్ష్మి , సిఐటియు జిల్లా కార్యదర్శి జగన్మోహన్‌రావు మాట్లాడుతూ దేశమంటే మట్టి కాదోరు దేశమంటే మనుషు లోరు అని గర్జించిన నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు అన్నారు. బ్రిటిష్‌ కాలం నాడే కన్యాశుల్కాన్ని , బాల్యవివాహాలను తన రచనల ద్వారా వ్యతిరేకించారని, వితంతు వివాహాలను దగ్గరుండి జరిపించారన్నారు. మహిళలకు ఇంటిపని , వంట పని నుంచి విముక్తి కల్పించి, ఆస్తి హక్కు కల్పించిన నాడే సమానత్వం సౌభ్రాతత్వం వస్తుందని అన్నారు. కానీ పాలకులు నూతన జాతీయ విద్యా విధానం ద్వారా మహిళలను చదువు నుంచి దూరం చేస్తున్నారని, ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న స్కీం వర్కర్లతో రాత్రి పగలు వెట్టిచాకిరి చేయిస్తున్నారని, పనికి తగ్గ ప్రతిఫలం దక్కడం లేదని అన్నారు. అందుకే గురజాడ స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కుమారి, లక్ష్మమ్మ, వెంకటలక్ష్మి రాజులమ్మ ,ఈశ్వరమ్మ, సుజాత ,లక్ష్మి ,రమణమ్మ, బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

➡️