ప్రజాశక్తి- దత్తిరాజేరు మండలంలోని గడసాం, చినకాద గ్రామాల మధ్యన ఉన్న కొండను మళ్లీ అక్రమార్కులు ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు. అక్కడ తవ్వకాలను ఆపాలని డివైఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి నాయుడు గతంలో కలెక్టర్‌కు, తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో తవ్వకాలను ఆపినట్టే ఆపి బుధవారం మళ్లీ ప్రారంభించారు. తవ్వకాలను వెంటనే ఆపాలని, అక్రమా ర్కులపై తగు చర్యలు తీసుకోవాలని స్థానిక తహశీల్దార్ రమేష్‌ను కోరగా దానిని ఆపడం మా పని కాదని మాకు సంబంధం లేదని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. గనులు భూగర్భ శాఖ అధికారులకు తెలియజేసినా ఎటువంటి స్పందనా లేదని డివైఎఫ్‌ఐ నాయకులు చెబుతున్నారు. వాస్తవానికి ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన కొండలను రక్షించాల్సిన బాధ్యత అధికారులదే. అలాంటిది ఇటువంటి వాటిపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారంటే ఏ స్థాయిలో ముడుపులు అందాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చును. ఇటువంటి అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మైనింగ్ అధికారి త్రినాధ్ రెడ్డిని వివరణ కోరగా గజపతినగరం మండలం మరుపల్లి క్వారీకి అనుమతి ఇచ్చామని గడసాం, చినకాద గ్రామాల మధ్య రోడ్డుకి తాము అనుమతి ఇవ్వలేదని అన్నారు.