ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్/కలెక్టరేట్ : మన్యంలో శుక్రవారవారం వేకువజాము నుంచి ముసురు ప్రారంభమైంది. దీంతో ఆరుగాలం కష్టించి పంటలు చేతికందేసరికి నీటిపాలవుతుందేమోనన్న రైతుల్లో గుబులు పట్టుకుంది. ఇప్పటికే జిల్లాలో అక్కడక్కడ పండిన వరిచేలు కోతలయ్యాయి. పొలాల్లో ఉన్న పంటను కాపాడుకొనేందుకు రైతులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.అకాల వర్షం కారణంగా జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఇప్పటికే మొదలైన వరి పంట తడవగా, కొన్నిచోట్ల అమ్మకానికి సిద్ధంగా ఉన్న ధాన్యం కూడా తడిసే ప్రమాదం పొంచి ఉందని రైతాంగం ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున జిల్లాలోని పలుచోట్ల వర్షం కురిసింది. దీంతో కోసిన పంట తడిసింది. అకాల వర్షాలు కారణంగా చేతికి అందిన పంట తడిసే అవకాశం ఉండడంతో రైతులు ధాన్యాన్ని టార్పాలిన్లుతో కప్పి కాపాడుకుంటున్నారు. మండలంలోని వెంకంపేట, చినబొండపల్లి, ఎమ్మార్‌నగరం, పెదబొండపల్లి, బందలుప్పి, ములగ, తాళ్లబురిడి, డోకిశిల, డికెపట్నం, నర్సిపురం, అడ్డాపుశీలకు చెందిన రైతులు వరికోతలు ముగించుకుని పంటను ఇంకా పొలాల్లోనే ఉంచారు. రెండురోజులుగా అలముకున్న తుఫాన్ వాతావరణంతో పంటను రక్షించుకోవడానికి కొన్నిచోట్ల నూర్పిడిచేసి కుప్పలుగా పోసిన ధాన్యాన్ని కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. అరకొరగా ఉన్న టార్ఫాలియన్లను ధాన్యం బస్తాలపై కప్పకోవడానికి హైరానా పడుతున్నారు. ఈ ఏడాది ముందుస్తుగానే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని నమ్మబలికిన అధికారుల నుంచి అటువంటి చర్యలు ఏమీలేకపోవడంతో విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా ధాన్యం నూర్పిడికి అవసరమైన టార్పాన్లను సబ్సిడీపై అందజేసేవారు. కనీసం ధాన్యం కాపాడుకోవడానికి టార్పాన్లను సరఫరా చేయని ఆర్‌బికెలు ఎందుకుని రైతులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. వాతావరణం అనుకూలించే దాకా రైతులు కోతలు కోయొద్దని, కోసిన ధాన్యాన్ని కుప్పలుగా ఏర్పాటు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు రైతులకు సూచనలు ఇస్తున్నారు. ఆకాశంలో మబ్బులు… రైతుల్లో గుబుళ్లువీరఘట్టం: మండలంలోని శుక్రవారం ఉదయం నుండి ఆకాశంలో మబ్బులు ఏర్పడడంతో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. గత మూడు రోజుల నుంచి ఇదే పరిస్థితి కానరావడంతో అన్నదాతలు మరింత భయభ్రాంతులకు గురవుతున్నారు. చేతికి అంది వచ్చిన పంట మరో కొద్ది రోజుల్లో చేతికొస్తుందన్న తరుణంలో వాతావరణంలో ఒక్కసారి మార్పు రావడం వల్ల ఆశలు అడియాసలు అవుతున్నాయని పలువురు అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా ఇదే పరిస్థితి కానరావడంతో పంటపై పెట్టిన పెట్టుబడులు రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని వాపోతున్నారు.వాతావరణ మార్పుతో రైతన్నల ఆందోళనపాచిపెంట: వాతావరణంలో ఒక్కసారిగా మబ్బులు ఏర్పడి శుక్రవారం ఉదయం పొగ మంచుతో పాటు చిరుజల్లులు పడడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వరి పంట యంత్రాల సహాయంతో కోతలు కోసి పంట పొలాల్లో చేళ్లు ఆరబెట్టి ఉన్నాయి. ఈ దశలో పడుతున్న చిరుజల్లులకు చేతికి అందిన పంట తడిసిపోయి రైతు తీవ్ర నష్టాన్ని కలుగుతుంది. చిరుజల్లులు ప్రస్తుతం కురవడంతో రైతులు కూలీలు సహాయంతో కోతలు కోసిన వరి చేను మడిలోనే కుప్పలుగా వేసి టార్పాన్లు పనులు కప్పుతున్నారు.