బిసి, ఎస్‌సి, ఎస్‌టిలకు ప్రాధాన్యత 

  ప్రజాశక్తి-నెల్లిమర్ల  :  వైసిపి పాలనలో బిసి, ఎస్‌సి, ఎస్‌టిలకు ప్రాధాన్యత ఇచ్చామని ఉప ముఖ్యంత్రి పీడిక రాజన్న దొర అన్నారు. మంగళ వారం సామాజిక సాధికార బస్సుయాత్ర సభ మంగళవారం మొయిద జంక్షన్‌లో జరిగింది. ఈ సందర్భంగా రాజన్న దొర మాట్లాడుతూ గతంలో టిడిపి హయాంలో వెనుకబడిన తరగతులకు ప్రాధాన్యత ఇవ్వలేదని, జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారం చేపట్టాక వీరందరికీ గుర్తింపు తీసుకువచ్చి తన పక్కన చోటు కల్పించారని అన్నారు. మత్స్యశాఖా మంత్రి సీదిరి అప్పల రాజు మాట్లాడుతూ లోకేష్‌ భయం గురించి మాట్లాడే ముందు తన మామ బాలకృష్ణ గురించి తెలుసుకోవాలన్నారు. తన ఇంట్లో కాల్పుల ఘటనలో బాలకృష్ణ ఆసుపత్రిలో చేరి భయపడి మతిస్థిమితం లేదని సర్టిఫికెట్‌ తీసుకోవడం, మీ నాన్న చంద్రబాబు ఓటుకి నోటు కేసుకు భయపడి రాత్రికి రాత్రి హైదరాబాదు నుంచి విజయవాడ వచ్చేసిన సంగతి తెలుసుకోవాలన్నారు. కాగా మత్స్య కారులకు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారం చేపట్టాక న్యాయం జరిగిందని అన్నారు. పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్‌ మాట్లడుతూ సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యతనిచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. దీనిలో భాగంగా సారిపల్లి పారిశ్రామిక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి సిఎం చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందని తెలిపారు. జనసేన నాయకులు పవన్‌ కళ్యాణ్‌కు అవగాహన లేకుండా రుషికొండపై ఆరోపణలు చేస్తున్నారని, అక్కడ జరుగుతున్నా నిర్మాణాలు ప్రభుత్వ పరంగా జరుగుతున్నాయన్న విషయం తెలుసుకోవాలన్నారు. రెవెన్యూశాఖా మంత్రి ధర్మాన ప్రసాద రావు మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ ద్వారా ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. బ్రిటీష్‌ కాలం నాటి భూమి చట్టాలను మార్పు చేసి రీసర్వే జరిపించి భూముల పంపిణీ చేయడం జరిగిందని, డి-పట్టా భూములకు హక్కులు కల్పించిన ఘనత జగన్‌ మోహన్‌ రెడ్డికి దక్కుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి, జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాస రావు, ఎంపి బెల్లాన చంద్ర శేఖర్‌, ఎమ్మెల్యేలు బడ్డుకొండ అప్పల నాయుడు, బొత్స అప్పలనరసయ్య, కంబాల జోగులు, అలజంగి జోగారావు, శంబంగి వెంకట చిన అప్పల నాయుడు, ఎమ్మెల్సీలు డాక్టర్‌ పి.సురేష్‌ బాబు, పాలవలస విక్రాంత్‌ పాల్గొన్నారు.వాహనాల దారి మళ్లింపుతో తీవ్ర ఇక్కట్లు మొయిద జంక్షన్‌లో నిర్వహించిన సభతో విజయనగరం-పాలకొండ రహదారి గుండా వెళ్లే వాహనాలను పోలీసులు దారి మళ్లించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

➡️