ప్రజాశక్తి-విజయనగరం : బడుగు వర్గాల ఆశా జ్యోతి, సమాజాభివృద్ధికి ఆద్యుడు అయిన జ్యోతిబా పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కషి చేయాలని ఉప సభాపతి కోలగట్ల వీరభద్ర స్వామి పిలుపునిచ్చారు. మంగళవారం జ్యోతిబా పూలే 133వ వర్ధంతిని కలెక్టరేట్ వద్ద ఘనంగా నిర్వహించారు. జ్యోతిబా పూలే, వారి సతీమణి సావిత్రీ బాయి పూలే విగ్రహాలకు ఉప సభాపతి కోలగట్ల వీరభద్ర స్వామి, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు, కలెక్టర్ నాగలక్ష్మి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ సావిత్రీ బాయి పూలే మహిళా విద్యాభివృద్ధికి కృషి చేస్తూ సామజిక మార్పుకు శ్రీకారం చుట్టారని తెలిపారు. వారి ఆశయాలకు , ఆలోచనలకూ ప్రతిరూపంగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు కనపడు తున్నాయని పేర్కొన్నారు. జెడ్‌పి చైర్మన్ మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల వారంతా అభివృద్ధి చెందాలని పూలే ఆనాడే భావించారని, వారి ఆశయాల మేరకు నేడు క్షేత్ర స్థాయిలో బిసిలను అభివృద్ధి చేయడానికి ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి పాటు పడుతున్నారని తెలిపారు. కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ మహిళల, దళితుల, అట్టడుగు వర్గాల వారి స్థితి గతులను మార్చాలని భావించిన పూలే భార్యా భర్తలు కలసి చదువుకు అత్యంత ప్రాముఖ్యత నిచ్చారని అన్నారు. తొలుత తన కుటుంభ సభ్యులకే చదువు చెప్పి తదుపరి ఒక పాఠశాలను ఏర్పాటు చేసి మహిళలకు విద్యనూ బోధించారని, తద్వారా మహిళా సాధికారతకు ఆనాడే తొలి అడుగు వేసారని తెలిపారు. సమాజం లో ఎంతో మార్పు జరిగినప్పటికీ ఇంకను ఎంతో సాధించవలసి ఉందని, అందుకు ప్రతి ఒక్కరూ కషి చేయాలని తెలిపారు. నగర మేయర్ వి. విజయలక్ష్మి, జిల్లా బి.సి. సంక్షేమ అధికారి కిడారి సందీప్, బిసి కార్పొరేషన్ ఇడి పెంటోజీ రావు, ఉత్తరాంధ్ర బిసి సంఘ నాయకులు ముద్దాడ మధు, పలు కార్పొరేషన్ల డైరెక్టర్లు, పలు బీసి సంఘాల నాయకులూ, ప్రతినిధులు పాల్గొన్నారు.సామాజిక దార్శనికుడు పూలే విజయనగరం టౌన్ : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే అని జనసేన నాయకులు గురాన అయ్యలు అన్నారు. జ్యోతిరావు ఫూలే వర్ధంతిని పురస్కరించుకుని కలెక్టరేట్ వద్ద పూలే, సావిత్రి బాయి ఫూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఆదాడ మోహన్ రావు, రాజేష్ , ఎమ్ .పవన్ కుమార్, గొల్లపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు.