ప్రజాశక్తి భోగాపురం : ప్రభుత్వం పేదలకు ఇచ్చిన డి-పట్టా భూములు అమ్మినా, వాటిని కొనుగోలు చేసినా ప్రభుత్వ నిబంధనల ప్రకారం నేరం. కాని అప్పట్లో చాలా మంది పెద్దలు పేదల నుంచి ఈ భూములను కొనుగోలు చేశారు. కొంతమంది గ్రామ పురోణీలు ద్వారా మరికొంత మంది ఏకంగా రిజిస్ట్రేషన్ ద్వారా కొనుగోలు చేశారు. అయితే ఇప్పుడు రిజిస్రేషన్లు జరిగిన భూములపై ప్రభుత్వ ఆదేశాల మేరకు పిఒటి (పట్టా బదలాయింపు నిషేధం) కేసులు నమోదు చేసేందుకు రెవెన్యూ అధికారులు సిద్దమవుతున్నారు. కేసులు నమోదు చేసిన తరువాత అవసరమైతే ఇతర అవసరాల కోసం వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. ఇటీవల ప్రభుత్వం డి-పట్టా భూములను జిరాయితీగా మార్చేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. అంతేకాక రెవెన్యూ రికార్డులు ప్రకారం డి-పట్టా ఇచ్చినట్లు ఎందులో నమోదైనా సరే వాటిని జిరాయితీగా మార్చేందుకు సిద్దమైంది. ఇందులో భాగంగా భోగాపురం మండలంలో సుమారు 4వేల ఎకరాలు డి-పట్టా భూములను పేదలకు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో సుమారు 500 ఎకరాలు వరకు రిజిస్రేషన్లు జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఇలా చూసుకుంటే జిల్లా వ్యావ్తంగా అనేక ఎకరాలు రిజిస్ట్రేషన్లు జరిగి ఉంటాయని అనుకుంటున్నారు. అప్పట్లో ఎవరిపేరు మీద ఈ భూములు ఇచ్చారో ప్రస్తుతం ఆభూమి మీద ఆ కుటుంబ సభ్యులు ఉన్నాసరే వారిపేరు మీద జిరాయితీగా మార్చనున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రికార్డులు సరిగా లేక గతంలో రిజిస్ట్రేషన్లు డి-పట్టా భూములకు సంబంధించిన రికార్డులు అప్పట్లో 2012కు ముందు సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో లేక డి-పట్టా భూములు, ల్యాండ్ సీలింగ్ భూములు దర్జాగా రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి. అప్పట్లో చాలామంది పేదల వద్ద ఏకంగా ఈ భూములను కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ప్రస్తుతం కొనుగోలు చేసిన వారే ఆ భూములుపై ఉన్నారు. కాని ఇలాంటి రిజిస్ట్రేషన్లు జరిగిన భూములను గుర్తించి పిఒటి కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. దీనికి సంబంధించి ఆయా తహశీల్దారు కార్యాలయాల్లో సమావేశాలను తహశీల్దార్లు నిర్వహిస్తున్నారు. డి-పట్టా భూములకు సంబంధించిన సర్వే నెంబర్లు సేకరించి విఆర్‌ఒలు ఇసిలు తీస్తున్నారు. ఇందులో ఇసి వచ్చిన సర్వే నెంబర్లును పిఒటి కేసులు కింద నమోదు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్లు జరిగితే పిఒటి కేసులు నమోదు చేస్తాంరిజిస్ట్రేషన్లు జరిగిన డి-పట్టా భూములను విఆర్‌ఒల ద్వారా గుర్తిస్తున్నాం. సంబంధిత సర్వే నెంబర్లకు ఇసిలు తీయిస్తున్నార. రిజిస్ట్రేషను జరిగినట్లు ఇసి వస్తే సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసి పిఒటి కేసులు నమోదు చేస్తాం.చింతాడ బంగార్రాజు, తహశీల్దార్, భోగాపురం మండలం