పలుచోట్ల రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

 ప్రజాశక్తి-గజపతినగరం  :  మండలంలోని పలు ఉన్నత పాఠశాలలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. నవంబర్‌ 26న ఈ కార్యక్రమం జరపవలసి ఉండగా, ఆదివారం సెలవు దినం కావడంతో ఒకరోజు ముందుగా ఈ కార్యక్రమం నిర్వహించారు. గజపతినగరం ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు పైడితల్లి, శంకర్‌ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకను చేపట్టారు. ముందుగా ప్రధానోపాధ్యాయులు చిప్పాడ రమేష్‌ కుమార్‌ రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ ప్రాధాన్యతను విద్యార్థులను వివరించారు. అనంతరం పాఠశాల విద్యార్థినులు దేశభక్తి గేయాలకు నృత్య ప్రదర్శన చేశారు. కోలాటం, కర్ర సాము వంటి కళాత్మక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. గజపతినగరం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో కూడా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మీసాల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విజయనగరం టౌన్‌ : స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా శనివారం నిర్వహించారు. కళాశాల ఇంఛార్జి ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బి. సుభ రాజ్యాంగం ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేశారు. ఈ సందర్భంగా వ్యాసరచన, క్విజ్‌ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో చరిత్ర విభాగాధిపతి డాక్టర్‌ సిహెచ్‌ ఉమామహేశ్వరరావు, రాజనీతి అధ్యాపకులు ఇ.దుర్గాదేవి, విద్యార్థులు పాల్గొన్నారు. జెవివి ఆధ్వర్యాన నెల్లిమర్ల : స్థానిక డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ బాలికల గురుకుల పాఠశాలలో జన విజ్ఞాన వేదిక, పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా జెవివి జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ ఎంవిఎన్‌ వెంకటరావు మాట్లాడుతూ రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలంటే పాఠశాల స్థాయిలో అవగాహన అవసరమన్నారు. రాజ్యాంగ విలువలు ఇప్పటి నుండి అలవరుచుకొని భావి భారత పౌరులుగా దేశానికీ, సామాన్య ప్రజలకు సేవ చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ కె.ఉషారాణి, జెవివి ఉపాధ్యక్షులు మురళి బాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️