నేటి నుంచి మెగా డ్రైవ్‌

Nov 30,2023 21:10

ప్రజాశక్తి-విజయనగరం   :  పేదలందరికీ ఇళ్ల పథకం కింద గృహ నిర్మాణాలు పూర్తి చేయడానికి డిసెంబర్‌ 1 నుండి మెగా కంప్లిషన్‌ డ్రైవ్‌ నిర్వహించాలని హౌసింగ్‌ ప్రత్యేక కార్యదర్శి దివాన్‌ మైదీన్‌ తెలిపారు. రాష్ట్రం లో ఈ అక్టోబర్‌లో 5.8 లక్షల గృహాలను పూర్తి చేసుకొని గృహ ప్రవేశాలు జరిపామని, వచ్చే జనవరి లోపల మరో 5 లక్షల గహాలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా నిర్ణయించారని తెలిపారు. గురువారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో మండల ప్రత్యేకాధికారులు, ఇంజినీరింగ్‌ అధికారులు, మండలాభివృద్ధి అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ నాగలక్ష్మితో కలసి మండల వారీగా లక్ష్యాలపై సమీక్షించారు. మెగా డ్రైవ్‌ కోసం మండల వారీగా కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 36 వేల గృహాలను పూర్తి చేశామని, మెగా మేళా లో డిసెంబర్‌, జనవరి రెండు నెలల్లో 16 వేల గృహాలను పూర్తి చేయాలని తెలిపారు. లబ్దిదారులను చైతన్య పరచి టైం లైన్‌లో పూర్తి చేయడం వేగంగా జరగాలన్నారు. లే అవుట్లలో పూర్తి మౌలిక సదుపాయాలను , సోక్‌ పిట్లను పూర్తి చేయాలన్నారు. బిల్డింగ్‌ మెటీరియల్‌ సరఫరా చేసేవారి తోను, కాంట్రాక్టర్‌ లతోను, మండల స్థాయి అధికారులతోను వెంటనే సమావేశాలు ఏర్పాటు చేసుకొని కార్యాచరణ తయారు చేసుకోవాల న్నారు. ఇళ్ల నిర్మాణాలకు ముందుకు రాని వారికీ నోటీసు లు జారీ చేయాలని, ఇళ్ల పట్టా రద్దు చేయడమే కాకుండా ఇప్పటివరకు ఇచ్చిన రుణాన్ని కూడా తిరిగి చెల్లించవలసి ఉంటుందని లబ్దిదారునికి చెప్పాలని అన్నారు. కలెక్టర్‌ నాగలక్ష్మి మాట్లాడుతూ ఇచ్చిన లక్ష్యాలను పూర్తి చేసి వచ్చే ఫిబ్రవరి లో సామూహిక గృహ ప్రవేశాలకు సిద్ధం కావాలని తెలిపారు. వచ్చే 2రోజుల్లో మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని, డిసెంబర్‌ 10లోపల సచివాలయ స్థాయిలో సమావేశం పూర్తి చేయాలని తెలిపారు. మండల ప్రత్యేకాదికారులు, ఎంపిడిఒలు దీనిపై అత్యంత శ్రద్ద చూపాలని తెలిపారు. సమావేశంలో హౌసింగ్‌ పీడీ శ్రీనివాసరావు ఇఇలు, డిఇలు, పిఆర్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఇంజినీరింగ్‌ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపిడిఒలు, మున్సిపల్‌ కమిషనర్‌లు పాల్గొన్నారు.

➡️