ప్రజాశక్తి-విజయనగరం : మహిళలపై జరిగే దాడుల్లో నమోదైన కేసుల్లో నిందితులకు కఠిన శిక్ష పడేలా దర్యాప్తు క్షుణ్ణంగా చేయాలని ఎస్‌పి. ఎం.దీపిక పోలీసు అధికారులకు సూచించారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నేర సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎస్‌పి వివిధ పోలీసు స్టేషనుల్లో నమోదైన కేసుల దర్యాప్తు ప్రగతిని సమీక్షించారు. రాత్రి పెట్రోలింగు, గస్తీని ముమ్మరం చేయాలని, ఎటిఎం కేంద్రాలను తరుచూ తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. చైన్ స్నాచింగ్స్ జరిగేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి నిఘా పెట్టాలని, చోరీల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని, రహదారి భద్రతపై ప్రజలకు మరింతగా అవగాహన కల్పించాలని సూచించారు. డిసెంబరు 9న నిర్వహించే లోక్ అదాలత్ లో ఎక్కువ ఐపిసి కేసులు డిస్పోజ్ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. 10లీటర్ల ఐఎంఎఫ్‌ఎల్ కన్నా తక్కువగా పట్టుబడిన ఎక్సైజ్ కేసుల్లో నిందితులతో చలానాలు కట్టించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం పలు కేసుల చేధనలో కృషి చేసిన ఎస్‌ఐలకు, కానిస్టేబుళ్లను ఎస్‌పి అభినందించి జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలను అందజేసారు. సమావేశంలో అదనపు ఎస్‌పి అస్మా ఫర్దీన్, ఎస్‌ఇబి అదనపు ఎస్‌పి ఎస్. వెంకటరావు, డిఎస్‌పిలు ఆర్.గోవిందరావు, పి.శ్రీధర్, ఎఎస్ చక్రవర్తి, యూనివర్స్, న్యాయ సలహాదారులు వై. పరశురాం, పలువురు సిఐలు , ఎస్‌ఐలు పాల్గొన్నారు.