ప్రజాశక్తి-విజయనగరం కోట : జిల్లాలో నెలకొన్న తీవ్ర వర్షాభావం పరిస్థితుల వల్ల ఎస్.కోట నియోజకవర్గంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, మరోవైపు ఇటీవల కురిసిన వర్షాలకు వరి పంట తీవ్ర దెబ్బతినడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని టిడిపి నాయకులు గొంప కృష్ణ అధికారులకు తెలిపారు. కరువు ప్రాంతంగా గుర్తించి రైతులకు క ఎకరాకు రూ.40వేలు చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు. ఈమేరకు కలెక్టరేట్ స్పందనలో కలెక్టర్ నాగలక్ష్మికి వినతి అందజేశారు. సోమవారం నిర్వహించిన జగనన్నకు చెబుదాంలో కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, జిల్లా రెవిన్యూ అధికారి ఎస్.డి.అనిత వినతులు స్వీకరించారు. ఎస్.కోట నియోజకవర్గ టిడిపి నాయకు లు గొంప కృష్ణ ఆధ్వర్యాన వేపాడ చుట్టుపక్క ప్రాంతాల రైతులు తడిచిన, మొల కలు వచ్చిన వరి దుబ్బులును తీసుకొచ్చి కలెక్టర్‌కు చూపించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఎస్.కోట, వేపాడ, లక్కవరపుకోట జామి, కొత్తవలస మండలాల్లో వర్షాభావం వల్ల రైతులు 80 శాతం పంట నష్టపోయారని, మిగతా 20శాతం పంట పండినప్పటికీ చేతికొచ్చిన తరుణంలో వర్షంతో తడిచిపోయి నష్టపోయారని తెలిపారు. తడిచిన ధాన్యం గింజలకు మొలకలు వచ్చాయని, దీంతో రైతులు కన్నీరు పెడుతున్నారని తెలిపారు. వెంటనే ప్రభుత్వం స్పందించి కరువు ప్రాంతంగా గుర్తించి రైతులను ఆదుకోవాలని కోరారు. ఆయన వెంట నియోజకవర్గ టిడిపి నాయకులు పాల్గొన్నారు.పారిశుధ్యాన్ని మెరుగుపర్చాలి గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపర్చాలని టిడిపి నాయకులు బొద్దల నర్సింగరావు, ప్రసాదుల లక్ష్మీప్రసాద్, గంటాపోలినాయుడు, ఐవిపి రాజు తదితరులు కలెక్టర్‌కు వినతినిచ్చారు. మండల పరిధిలో ప్రతి గ్రామంలోనూ చెత్త పేరుకుపోయి మురికి కాలువలు కంపు కొడుతున్నాయని, దోమలు పెరిగిపోయాయి ప్రజలు ఆనారోగ్యం బారిన పడుతున్నారని అన్నారు. ఓటరు జాబితా నుంచి తొలగించిన ఓట్లను వెంటనే చేర్చాలని పెదవేమిలి గ్రామస్తులు వినతినిచ్చారు. గ్రామ ఓటరు జాబితాలో 126 ఓట్లు గల్లంతయ్యాయని తెలిపారు. సమగ్ర విచారణ జరిపించి బిఎల్‌ఓ పై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ భూమిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని అట్టాడ సర్పంచ్ అమ్మన్నదొర కోరారు. పూర్తిస్థాయిలో పరిష్కరించాకే ఆన్‌లైన్‌లో నమోదుజగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతులు పూర్తిస్థాయిలో పరిష్కరించిన మీదటే ఆన్‌లైన్ లో పరిష్కారం అయినట్లుగా చూపాలని, అసంపూర్తి నివేదికలను ఇవ్వొద్దని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి జిల్లా అదికారులను ఆదేశించారు. ఒకసారి పరిష్కరించినట్టు చూపిన వినతులను మళ్లీ తెరిచే పరిస్థితి రాకుండా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అధిక సంఖ్యలో వినతులు వస్తున్న ప్రభుత్వ శాఖలు తమకు అందుతున్న వినతులను పెండింగ్‌లో పెట్టకుండా త్వరగా పరిష్కరించాలని చెప్పారు. డిపిఎం రాజేశ్వరి, ఎస్‌డిసిలు సుదర్శనదొర, సుమబాల, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.ఫిర్యాదుదారులకు తక్షణ న్యాయం : ఎస్‌పి జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుంచి ఎస్‌పి ఎం.దీపిక ఫిర్యాదులను స్వీకరించారు. బాధితుల సమస్యలు తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని, ఫిర్యాదుదారులకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. స్పందనలో మొత్తంగా 42 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు ఎస్‌పి అస్మా ఫర్హీన్, దిశ డిఎస్‌పి ఆర్.శ్రీనివాసరావు, డిసిఆర్‌బి, ఎస్‌బి సిఐలు పాల్గొన్నారు.