ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : దళితులు సాగు భూములకు పట్టాలు ఇవ్వాలని, ఎస్‌సి కార్పొరేషన్ రుణాలు పునరుద్ధరణ చేయాలని, డప్పు కళాకారులు చర్మకారుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వచ్చేనెల 11న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి ఆర్.ఆనంద్ తెలిపారు. సోమవారం ఎల్‌బిజి భవనంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 40, 50 ఏళ్లగా జిల్లాలో దళితులు ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నా ప్రభుత్వం నేటికీ ఎటువంటి హక్కులు కల్పించలేదని అన్నారు. భూ రీసర్వే పేరుతో ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటున్న వారికి పట్టాలిస్తామని చెబుతున్న ప్రభుత్వం దానిని పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని అన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత దళితులకు కార్పొరేషన్ ద్వారా అందుతున్న 29 రకాల లోన్లను రద్దుచేసి స్వయం ఉపాధిని దూరం చేసిందని విమర్శించారు. డప్పు కళాకారులకు, చర్మకారులకు రూ.3వేలు పింఛను ఇస్తున్నా పెరిగిన ధరలతో పోల్చుకుంటే చాలటం లేదని తెలిపారు. డబ్బులు, గజ్జలు, దుస్తులు, పనిముట్లు నేటి వరకు మంజూరు చేయలేదని అన్నారు. డప్పు కళాకారులకు శర్మకారులకు బస్సు పాస్ సౌకర్యం కూడా కల్పించాలని, అర్హులైన దళితులకు రెండు ఎకరాలు భూమి ఇవ్వాలని, శ్మశాన వాటికలకు స్థలాలు కేటాయించాలని, బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారానికి డిసెంబర్ 11న తలపెట్టిన చలో కలెక్టరేట్ కార్యక్రమానికి జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకట్రావు, జిల్లా గౌరవ అధ్యక్షులు రాకోటి రాములు పాల్గొన్నారు.