ప్రజాశక్తి – పూసపాటిరేగ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు బోట్లను ఒడ్డుకు చేరుస్తున్నారు. అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మండలంలోని తీరప్రాంతంలో అధికారులు అప్రమత్తమయ్యారు. శనివారం నుంచి మూడు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని తహశీల్దార్ భాస్కరరావు తెలిపారు. మండలంలో ఉన్న మత్స్యకార గ్రామాల విఆర్ఒలు, కార్యదర్శులు అప్రమత్తం కావాలన్నారు. మూడు రోజులపాటు సముద్రంలో వేట నిషేధ హెచ్చరికలు జారీ చేయాలన్నారు. తీరగ్రామాల్లో దండోరా వేయించి తుపాను హెచ్చరికను ప్రకటించాలని తెలిపారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించాలన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులు అప్రమత్తమై, తుపాను తీవ్రతను బట్టి చర్యలు చేపట్టాలన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్తు సమస్య వచ్చే అవకాశం ఉందని, ముందస్తుగానే తాగునీరు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా వెంటనే సమాచారం ఇవ్వాలని తెలిపారు.