టిడిపి సునామీలో వైసిపి కొట్టుకుపోవడం ఖాయం

ప్రజాశక్తి- విజయనగరం కోట : రాబోయే ఎన్నికల్లో టిడిపి సునామీలో వైసిపి కొట్టుకుపోవడం ఖాయమని చీపురపల్లి నియోజకవర్గ టిడిపి ఇంఛార్జి కిమిడి నాగార్జున అన్నారు. మెరకముడిదాం మండలం పూతికవలస గ్రామానికి చెందిన పలు కుటుంబాలు వైసిపి పార్టీని వీడి టిడిపిలో చేరాయి. చీపురుపల్లిలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాగార్జున వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ టిడిపి – జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రాష్ట్రంలో వైసిపి పాలనలో అరాచకం తప్ప అభివృద్ధి ఎక్కడా కానరావడం లేదన్నారు. వైసిపి ప్రభుత్వం చేసిన పాపాలు ప్రజలకు శాపాలుగా మారాయన్నారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయమని, ఆయన సారధ్యంలో రాష్ట్రం అని రంగాల్లో అభివృద్ధి చెందడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మెరకముడిదాం మాజీ ఎంపిపి తాడ్డి సన్యాసినాయుడు, పార్టీ నాయకులు కెంగువ ధనుంజయ, జమ్ము శంకరరావు, పిన్నింటి సన్యాసి నాయుడు, ముదునూరు కృష్ణరాజు, ఆవాల అప్పలనాయుడు, ముల్లు రమణ, కోరాడ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

➡️