ప్రజాశక్తి-భోగాపురం, డెంకాడ : విజయనగరం సమీపంలోని చెల్లూరు నుంచి గొట్లాం వరకు ఇటీవల బైపాస్‌రోడ్డు నిర్మించిన విషయం తెలిసిందే. ఆ రహదారి నిర్మించిన నూకాంబిక కనస్ట్రక్షన్ సంస్థయే ఈ టోల్‌గేట్ నిర్మాణ పనులు చేపడుతోంది. బైపాస్ రోడ్డు నిర్మించినందుకు గాను ఆ సంస్థకు టోల్‌గేటు నిర్వహణ అప్పగించినట్లు తెలుస్తోంది. కేంద్రప్రభుత్వం కొంతకాలం క్రితం జాతీయ రహదారుల నిర్మాణాలకు అయిన ఖర్చును ప్రజల నుంచి వసూలు చేసేందుకుగాను ఆయా నిర్మాణ సంస్థలు టోల్ ఫీజులు వసూలు చేసుకునేందుకు వీలు కల్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇక్కడ టోల్‌గేటు ఏర్పాటవుతోంది. ఈ పనులు మరో రెండు నెలల్లో పూర్తి కానున్నాయి. సంక్రాంతి తరువాత వాహనదారుల నుంచి టోల్ ఫీజు వసూలు చేయనున్నారు. ప్రధానంగా ఒడిశా, చత్తీస్‌ఘడ్‌తో పాటు మన్యం, విజయనగరం జిల్లా వాసులు విశాఖ వెళ్లాలంటే ఆ రహదారి మీదుగానే వెళ్లాలి. ఈనేపథ్యంలో వాహనదారులంతా టోల్‌ట్యాక్స్ కట్టాల్సిందే. ప్రధానంగా విశాఖతో వాణిజ్య సంబంధాలు గల వాహనాలు ఎక్కువగా ఈ రహదారి మీదుగానే రాకపోకలు సాగిస్తుంటాయి. త్వరలో భోగాపురం వద్ద నిర్మిస్తున్న అంతర్జాతీయ విమానశ్రయానికి వెళ్లాలన్నా ఇదే రహదారి నుంచి వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జాతీయ రహదారి అధికారులు జొన్నాడ సమీపాన టోల్‌గేట్ నిర్మిస్తే అధిక ఆదాయం వస్తుందని భావించి నిర్మాణం చేపడుతున్నారు. ఇప్పటికే భూ సేకరణ చేపట్టి పనులు ముమ్మరం చేశారు. ఇక్కడ 8లైన్ల ద్వారా టోల్‌ఫీజు వసూలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సంబంధించిన కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. డెంకాడ మండలం నాతవలస వద్ద ఇప్పటికే ఉన్న టోల్‌గేటు వల్ల జిల్లా ప్రజలపై పెద్దగా బారం లేనప్పటికీ ఇక్కడ ఏర్పాటు చేస్తున్న టోల్‌గేటు వల్ల పెనుభారం పడే అవకాశాలు ఉన్నాయి. ప్రజలపై భారాలు వేసేందుకు జాతీయ రహదారి సంస్థ రంగం చేసిన నేపథ్యంలో జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు స్పందించకపోవడం గమనార్హం.