– అర్హులందరికీ మంజూరు చేయాలి
– ఎపిడబ్ల్యూజెఎఫ్ ఆధ్వర్యంలో డిఆర్‌ఒకు వినతి
ప్రజాశక్తి – నంద్యాల : ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో ఉన్న కఠిన నిబంధనలను సడలించాలని ఎపిడబ్ల్యూజెఎఫ్ ప్రతినిధి బందం జిల్లా రెవిన్యూ అధికారి పుల్లయ్యను కోరింది. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన స్పందన కార్యక్రమంలో ఎపిడబ్ల్యూజెఎఫ్ ప్రతినిధి బృందం డిఆర్‌ఒకు వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా ప్రతినిధి బృందం మాట్లాడుతూ ప్రభుత్వం ఇవ్వాలనుకున్న మూడు సెంట్ల ఇళ్ల స్థలాల విషయంలో 60/40 షేర్ పేరుతో 40 శాతం జర్నలిస్టులు చెల్లించాలని షరతులు పెట్టడం వలన చాలా మంది అమౌంట్ చెల్లించలేని పరిస్థితి ఉందన్నారు. కాబట్టి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను నామినల్ ధరకు ఇవ్వాలని కోరారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి ఇల్లు ఉంటే ఈ స్కీంకు అనర్హులని ప్రకటించడం బాధాకరమని అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఇదే వృత్తిని నమ్ముకుని జర్నలిస్టులు పని చేస్తున్నారని, అలాంటి వారికి ఎలాంటి నిబంధనలు లేకుండా ఉదారంగా మూడు సెంట్ల స్థలం కేటాయించాలన్నారు. త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం తక్షణమే వెబ్‌సైట్‌లో దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని, అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎపిడబ్ల్యూజెఎఫ్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ డి.మౌలాలి, ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు మాదాల శ్రీనివాసులు, కె.మద్దయ్య, నంద్యాల పట్టణ అధ్యక్ష కార్యదర్శులు శివ, జగన్మోహన్, పాణ్యం నియోజకవర్గం అధ్యక్షులు సుబ్బయ్య, ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, సహాయ కార్యదర్శి రంగస్వామి, బనగానపల్లె నియోజకవర్గ ఉపాధ్యక్షులు రామచంద్రారెడ్డి, నరసింహా రెడ్డి, మండల అధ్యక్షులు చంద్రశేఖర్, నాయకులు సుబ్బరాయుడు, జాషువా, ఇక్బాల్, సుబ్బరాయుడు, శ్రీనివాసులు, జాకోబ్, రాజు, అబ్దుల్ మజీద్, బాబు తదితరులు పాల్గొన్నారు.