ప్రజాశక్తి-విజయనగరం : రాష్ట్ర ప్రభుత్వం చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు అత్యధిక ప్రోత్సాహాన్నిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. పారిశ్రామిక వేత్తలు ఎలాంటి సమస్య వున్నా ఒక ఫోన్‌కాల్ చేస్తే వాటిని పరిష్కరించే పరిస్థితి ఏర్పడాలన్నారు. రాష్ట్రంలో ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు వర్చ్యువల్‌గా ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేసిన అనంతరం ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మాట్లాడారు. రాష్ట్రంలో వచ్చే ఫిబ్రవరిలో పరిశ్రమలకు ప్రభుత్వం మంజూరు చేయాల్సిన రాయితీల విడుదలకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర స్థాయి పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు. ఎపి ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఏర్పాటైన ఆహారశుద్ధి(ఫుడ్ ప్రాసెసింగ్) పరిశ్రమలను ముఖ్యమంత్రి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చ్యువల్‌గా ప్రారంభించారు. దీనిలో భాగంగా పూసపాటిరేగ మండలం కోనాడలో బ్లూఫిన్ ఎంటర్‌ప్రైజెస్ ఆధ్వర్యం లో రూ.13 కోట్లతో ఏర్పాటు చేస్తున్న నూడిల్స్, పాస్తా, సేమియా, పొటాటో చిప్స్, చిరుధాన్యాల ఆధారిత ఆహార ఉత్పత్తులు తయారచేసే పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా 45 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించడంతో పాటు చిరుధాన్యాలు పండించే వంద మంది ఈ ప్రాంత రైతులకు కూడా ప్రయోజనం కలుగుతుందనికలెక్టర్ ఎస్.నాగలక్ష్మి వెల్లడించారు. ఎల్.కోట మండలం రేగ గ్రామంలో జైకిసాన్ రైతు ఉత్పత్తి దారుల సంఘం ఆధ్వర్యంలో రూ.2.50 కోట్లతో ఏర్పాటు చేసిన నువ్వులతో ఆహార ఉత్పత్తులు రూపొందించే ఆహారశుద్ది ప్లాంట్‌కు ముఖ్యమంత్రి వర్చ్యువల్‌గా శంకుస్థాపన చేశారు. నువ్వుల నూనెతో పాటు, చిక్కీలు తయారుచేసి అందించే విధంగా ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. జిల్లాలో అత్యధిక సంఖ్యలో వున్న నువ్వులు పండించే రైతులకు ఈ ప్లాంటు ఏర్పాటు ద్వారా ఎంతో ప్రయోజనం కలుగుతుందని కలెక్టర్ చెప్పారు. నెల్లిమర్లలోని ఎపిఐఐసి పారిశ్రామిక పార్కులో క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం కింద రూ.6.46 కోట్లతో చేపట్టనున్న మౌలిక వసతులు, సుందరీకరణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. పారిశ్రామిక పార్కులో ఇప్పటికే వున్న పరిశ్రమలకు అవసరమైన వసతులు కల్పించడం, కాలువలు, అంతర్గత రోడ్లు, గార్డెనింగ్ తదితర పనులను చేపట్టనున్నట్టు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో ఆయా పరిశ్రమల ఏర్పాటు కోసం ఉద్దేశించిన శిలాఫలకాలను కలెక్టర్ ఆవిష్కరించారు. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి సమస్య వున్నా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమం లో పరిశ్రమల జిల్లా అధికారి పాపారావు, బ్లూఫిన్ పరిశ్రమ ప్రతినిధి ఆర్.గణపతిరావు, ఉద్యానశాఖ అధికారులు పాల్గొన్నారు.