ప్రజాశక్తి-విజయనగరంటౌన్ : జిల్లా తరపున వివిధ రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన పలువురు క్రీడాకారులను కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అభినందించారు. జాతీయ స్థాయి క్రీడల్లో విజేతలుగా నిలిచిన పలువురు క్రీడాకారులు కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో సోమవారం కలెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారు సాధించిన విజయాలను గురించి కలెక్టర్ తెలుసుకొని వారిని అభినందిస్తూ జిల్లా ఖ్యాతిని వ్యాప్తి చేయడంలో వారు చేసిన కృషిని ప్రశంసించారు. రానున్న రోజుల్లోనూ మంచి క్రీడాకారులుగా రాణించి మరిన్ని విజయాలు సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.గోవాలో ఇటీవల ముగిసిన జాతీయ క్రీడల్లో స్క్వే మార్షల్ ఆర్ట్స్‌లో మన రాష్ట్రం తరపున పాల్గొని కాంస్య పతకం సాధించిన ములగపాక అంజనీప్రసాద్ తన తండ్రి, కోచ్ ఎం.త్రినాధరావుతోపాటు జిల్లా కలెక్టర్‌ను కలిశారు. శ్రీలంకలో వచ్చే జనవరిలో జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే జట్టుకు తాను ఎంపికైనట్టు వివరించారు. జాతీయ క్రీడల్లో రాష్ట్రానికి చెందిన ముగ్గురు క్రీడాకారులకు పతకాలు లభించగా అందులో మన జిల్లా కొత్తవలసకు చెందిన ములగపాక అంజనీప్రసాద్ ఒకరని కోచ్ తెలిపారు. సెట్విజ్ సిఇఒ రాంగోపాల్ కూడా వీరితోపాటు వున్నారు. రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో రెండో స్థానంలో నిలిచి జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే మన రాష్ట్ర జట్టుకు ఎంపికైన కొప్పెర్ల డా.బి.ఆర్.అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకులం విద్యార్థులు కూడా జిల్లా కలెక్టర్‌ను కలిశారు. కొప్పెర్ల గురుకుల పాఠశాల జట్టులోని బి.శ్రావణ్ కుమార్, ఎ.అజరు రాజులు అండర్-19 జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. నగరంలోని నాగవంశం వీధికి చెందిన కనకల శ్రావణ్ కుమార్ జాతీయ జూనియర్ జట్టుకు ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా మహిళా జట్టు ఈనెల 29,30, డిసెంబర్ 1 వ తేదీ నుంచి కర్నూల్ జిల్లా గోనెగండ్ల లో జరగబోయే 70వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలలో జిల్లా మహిళా జట్టు పాల్గొంటుందని జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు రంగారావు దొర తెలిపారు, వారం రోజులుగా సీటీ క్లబ్ లో శిక్షణ అనంతర 12 మందిని ఎంపిక చేసినట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.ప్రభావతి తెలిపారు.. ఈ సందర్బంగా జిల్లా జట్టు మంచి ప్రతిభ చూపాలని ఆర్గనైజింగ్ కార్యదర్శి నడిపేన లక్ష్మణరావు,మరియు కార్యవర్గ సభ్యులు తెలిపారు.