ప్రజాశక్తి – పూసపాటిరేగ : కొంత మంది కార్మికులను పనిలోకి తీసుకొని కొంత మందిని వదిలేస్తామంటే ఊరుకునేది లేదని మైలాన్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకుడు నల్ల అప్పలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని సిపి ఆక్వా పరిశ్రమలో ఈ ఏడాది సెప్టెంబర్‌లో కార్మికులు, యాజమాన్యం మద్ద స్వల్ప వాగ్వివాదం పరిశ్రమ లాకవుట్‌కు దారితీసింది. ఈ నెపథ్యంలో యాజమాన్యం లాకవుట్ ప్రకటించడమే కాకుండా పరిశ్రమలో ఎనిమిది మంది కాంట్రాక్ట్‌ర్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అక్రమ లాకవుట్ ఎత్తివేయాలని కార్మికులు పలుమార్లు జిల్లా, మండల అధికార్లును కోరారు. దాంతో పాటు జెసిఎల్, డిసిఎల్ వద్ద పలుమార్లు సమావేశాలు జరిగాయి. పరిశ్రమలో సుమారుగా 450 మంది కార్మికులు పనిచేస్తున్నారని, వారందరికి సరిపడే పని పరిశ్రమలో లేదని యాజమాన్యం డిసిఎల్‌కు తెలిపింది. అయితే ప్రస్తుతం ఆరుగురు కాంట్రాక్టర్లును పుణరుద్దరించి, సుమారుగా 400 మందిని పనిలోకి తీసుకుంటామని తెలిపింది. దానికి కార్మికపక్ష నాయకుడు నల్ల అప్పలరాజు, కార్మికులు అంగీకరించలేదు. అందరిని ఒకేసారి పనిలోకి తీసుకోవాలని, లేని పక్షంలో 48 మంది కార్మికులును విడతల వారీగా పనిలోకి తీసుకుంటామని యజామాన్యం హామీ ఇవ్వాలని కోరారు. ఈ అంశాలపై డిసెంబర్ 4వ తేదిన మరో సారి జెసిఎల్ వద్ద చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం కొంత మంది కార్మికులను పనిలోకి తీసుకున్నారు. దాంతో కార్మికులంతా పరిశ్రమ వద్దకు చేరుకొని చర్చలు ఉంటుండగా ఇలా మద్యలో కార్మికులను ఎందుకు తీసుకుంటున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు. పరిశ్రమవద్దకు భోగాపురం సిఐ ఎబి వెంకటేశ్వర్రావు, పూసపాటిరేగ ఎస్‌ఐ బాలకృష్ణ చేరుకొని కార్మికులతో చర్చించి సమస్య అడిగి తెలుసుకున్నారు. అనంతరం యాజమాన్యంతో చర్చించి ప్రస్తుతం 400 మంది కార్మికులును పనిలోకి తీసుకుంటామని మిగిలిన 48 మందిని అవసరాన్ని బట్టి తీసుకుంటామని యాజామాన్యం చెప్పినట్లు సిఐ తెలిపారు. దానికి కార్మికులు నిరాకరించారు. కార్మికులు, కాంట్రాక్టర్లతో మేము సమావేశం ఏర్పాటు చేస్తామని సిఐ చెప్పడంతో దానికి కార్మికులు అంగీకరించి శాంతించారు. రెండు రోజుల్లో కార్మికులు, కాంట్రాక్టర్లతో పోలీసులు అధ్వర్యంలో జరిగే చర్చలు అనంతరం తమ కార్యచరణ ప్రకటిస్తామని కార్మికులు తెలిపారు. అందరినీ పనిలో తీసుకుంటే పర్వాలేదని లేకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.