ఓటింగ్‌ ప్రభావిత అంశాలను గుర్తించండి

Nov 29,2023 20:50

ప్రజాశక్తి-విజయనగరం :  ఓటింగ్‌ ప్రక్రియకు అవరోధం కలిగించే వ్యక్తులను, ప్రాంతాలను, గ్రామాలను, పోలింగ్‌ స్టేషన్లను , నియోజకవర్గాల వారీగా గుర్తించి మాపింగ్‌ చేయాలని కలెక్టర్‌ నాగలక్ష్మి తెలిపారు. ఎన్నికల కమిషన్‌ విడుదల చేసిన ఎన్నికల క్యాలెండరు ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్‌కు 6 నెలల ముందు నుండే సంసిద్ధతపై పలు శిక్షణా కార్యక్రమాలు ఉంటాయని, అందులో భాగంగానే మాపింగ్‌ పై శిక్షణ నిర్వహిస్తామని తెలిపారు. కలెక్టరేట్‌ ఆడిటోరియంలో మాపింగ్‌ పై సెక్టరల్‌ అధికారులకు, సెక్టరల్‌ పోలీస్‌ అధికారులకు బుధవారం శిక్షణ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ నోటిఫికేషన్‌ జారీ చేసిన తర్వాత ఎన్నికలకు తక్కువ సమయం ఉంటుంది కావునా ముందే ఈ సంసిద్ధతా కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలని అన్నారు. వల్నరబిలిటి ని ముందుగా అర్ధం చేసుకోవాలని, పోల్‌ డే, ప్రీ పోల్‌ డే, పోస్ట్‌ పోల్‌ బాధ్యతలను పూర్తిగా తెలుసుకోవాలన్నారు. ఓటర్లను భయ భ్రాంతులకు గురి చేసే అంశాలను, వత్తిడిని పెంచే అంశాలు, గత సంఘటనలు, రాజకీయ పక్షాల తీరు, ఓటర్ల కులంపై ప్రభావితం, బైండోవర్‌ కేసులు, ఆయుధాల డిపాజిట్‌, మైగ్రేటేడ్‌ పాప్యులేషన్‌ , మరీ ఎక్కువ, మరీ తక్కువ శాతం ఓటింగ్‌ అయిన పోలింగ్‌ బూత్‌ లు వీటన్నిటి వివరాలను నిర్దేశిత ఫార్మాట్‌ లలో రూపొందించి పంపాలన్నారు. వీటి ఆధారంగానే ఎన్నికల సిబ్బంది, పోలీస్‌ డిప్లాయ్మెంట్‌ ఉంటుందని తెలిపారు. డిసెంబర్‌ 5,6 తేదీలలో అన్ని నియోజకవర్గాల్లో జాయింట్‌ తనిఖీ చేసి 6వ తేదీన నివేదికలు సమర్పించాలని తెలిపారు. ఈ నివేదికలు పంపేటప్పుడు పోలీస్‌, రెవిన్యూ, ఎన్నికల అధికారుల మధ్య సమన్వయం ఉండాలని అన్నారు. జిల్లా ఎస్‌.పి దీపిక మాట్లాడుతూ స్వేచ్చాయుత ఎన్నికల నిర్వహణ కోసం వల్నరబిలిటి మాపింగ్‌ చేయాలని, హెచ్‌సి నుండి ఆ పైన ఉన్న కేడర్‌ వారిని సెక్టోరల్‌ అధికారులుగా నియమించామని తెలిపారు. ఒక్కో సెక్టార్‌కు 10 నుండి 12 పోలింగ్‌ స్టేషన్లు ఉంటాయని తెలిపారు. గత 5 ఎన్నికలలో జరిగిన ఘటనల ఆధారంగా పరిశీలించాలని, మహిళా పోలీస్‌ సహకారాన్ని కూడా తీసుకోవాలని తెలిపారు. వల్నరబిలిటి మాపింగ్‌ పై మెప్మా పీడీ సుధాకర్‌, వన్‌ టౌన్‌ సిఐ బెండి వెంకట రావు పవర్‌ పాయింట్‌ ద్వారా శిక్షణలో వివరించారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌, డిఆర్‌ఒ అనిత, రెవిన్యూ, పోలీస్‌, జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

➡️