ప్రజాశక్తి- విజయనగరం టౌన్ : డిసెంబర్ 1 నుంచి 5 వరకు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతామని, 6న అంబేద్కర్ విగ్రహాలకు వినతినిస్తామని ప్రభుత్వం స్పందించకుంటే డిసెంబర్ 8 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బి.పైడిరాజు, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎ.జగన్మోహన్‌రావు పిలుపునిచ్చారు. బుధవారం పూల్ బాగ్ 2వ సెక్టార్, బొందుల గూడెం 3వ సెక్టార్ సమావేశాల సందర్భంగా వారు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మొండిగా వ్యవహరిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ కంటే అదనంగా జీతం ఇస్తామని చెప్పి నేడు మాట మార్చారని చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారని అన్నారు. ప్రస్తుత ధరల్లో మెనూ చార్జీలు సరిపోవని, అంగన్వాడి సెంటర్లకు కరెంట్ బిల్లులు వేలల్లో వస్తుంటే ప్రభుత్వం రూ. 200 ఇచ్చి సరిపెడుతుందన్నారు. 2014 నాటి బకాయిలను, సర్ చార్జీలు, సర్దుబాటు ఛార్జీల భారం ఎలా భరించగలమని ప్రశ్నించారు. తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ మాదిరిగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పినా రాష్ట్రంలో అమలు చేయడం లేదన్నారు.. ఐసిడిఎస్‌కు బడ్జెట్‌లో కేటాయింపులు పెంచాలన్నారు. ఈ డిమాండ్ల సాధనకు డిసెంబర్ ఒకటి నుంచి ఐదు వరకు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతామని, డిసెంబర్ 6న అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రంలో ఇస్తామని తెలిపారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే డిసెంబర్ 8 నుంచి 21 సమ్మెకు సిద్ధం కాబోతున్నామని తెలిపారు. కార్యక్రమంలో సెక్టార్ లీడర్లు శివలక్ష్మి, సునీత, ప్రసన్న, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.