ఆరుతడి పంటలకు సాగునీరు అందించాలి

Nov 25,2023 21:07
ఫొటో : వినతిపత్రం అందజేస్తున్న రైతు సంఘాల నాయకులు

ఫొటో : వినతిపత్రం అందజేస్తున్న రైతు సంఘాల నాయకులు
ఆరుతడి పంటలకు సాగునీరు అందించాలి
– తహశీల్దారుకు వ్యవసాయ కార్మిక సంఘం వినతి
ప్రజాశక్తి-జలదంకి : జలదంకి మండల రైతంగానికి చిన్నక్రాక బ్యాలెన్స్‌ రిజర్వాయర్‌ ద్వారా సోమశిల జలాలను అందించి ఆరుతడి పంటలకు సాగు చేసుకునేందుకు చర్యలు చేపట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్‌ చేసింది. శనివారం వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాలు సంయుక్తంగా జలదంకి తహశీల్దార్‌ బివి రమణారావుకు ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. గత ఏడాది సోమశిల జలం అధికారుల నిర్లక్యం వల్ల లేట్‌ (ఖరీఫ్‌) లేట్‌ (రబీ) సాగుచేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారని వాపోయారు. దానికి తోడు అకాల వర్షాల వల్ల మండలంలోని కొన్ని గ్రామాలలో కోతలకు వచ్చిన పంట నీటి పాలయిందని ఆవేదన వెలిబుచ్చారు. చేపల కాంట్రాక్టర్లు చెరువులోని నీటిని అధికారుల అనుమతులు లేకుండా తమ ఇష్టారాజ్యంగా నీటిని వదిలి వేసి చేపలు పట్టుకున్నారన్నారు. ఈ కారణంగా కొంతమంది రైతులు కొన్ని గ్రామాలలో పంటలు చేతికి అందే దశలో ఆఖరితడులు అందక పైర్లు తీవ్రంగా నష్టపోయాయని జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు తాళ్లూరు మాల్యాద్రి తమ ఆవేదన వెలిబుచ్చారు. ఈసారైనా మానవత దృక్పథంతో అధికారులు స్పందించి ఆరుతడి పంటలకు సాగునీరు అందిస్తే రైతులు అప్పుల ఊబి (అప్పుల బాధ) నుండి బయటపడతార న్నారు. జలదంకి అధికారులతో పాటు ఇరిగేషన్‌, అగ్రికల్చర్‌, సోమశిల, పోలీసు శాఖలు సమన్వ యంగా పనిచేస్తే రైతులుకు లోటు లేకుండా ఆరుతడి పంటలకు సాగునీరు అందించవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రావి మాల్యాద్రి, గోసు ప్రసాద్‌, మద్దిరెడ్డి కృష్ణారెడ్డి, ముప్పరాజు వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

➡️