ఆడుదాం ఆంధ్రలో పాల్గొనండి

 ప్రజాశక్తి-విజయనగరం :  రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టిన మెగా క్రీడోత్సవం ‘ఆడుదాం ఆంధ్ర’లో క్రీడాభిమానులంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి పిలుపునిచ్చారు. ఈ క్రీడా పోటీల్లో పాల్గొనే వారికోసం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నేటి నుంచి జిల్లాలోని అన్ని సచివాలయాల్లో ప్రారంభమైందని, ఆయా సచివాలయా లకు వెళ్లి తమ పేర్లు నమోదు చేయించుకోవాలని తెలిపారు. డిసెంబరు 15 నుంచి 44 రోజుల పాటు ఐదు దశల్లో ఈ పోటీలు జరుగుతాయని వెల్లడించారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ తో కలసి మాట్లాడుతూ గ్రామ, వార్డు స్థాయిల్లో, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు జరుగుతాయన్నారు. మహిళలు, పురుషుల విభాగాల్లో కబడ్డీ, ఖోఖో, క్రికెట్‌, బాడ్మింటన్‌, వాలీబాల్‌ క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయన్నారు. 15 ఏళ్లకు పైబడి వయస్సు కలిగిన వారు ఎవరైనా ఈ పోటీల్లో పాల్గొనవచ్చని, పోటీల్లో పాల్గొనదలచిన వారంతా తప్పనిసరిగా సచివాలయాల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. వ్యాయామ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో అందుబాటులో వున్న మైదానాలను ఎంపికచేసి క్రీడలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. అన్ని గ్రామాలు, వార్డుల నుంచి క్రీడాకారులు ఈ క్రీడోత్సవాల్లో పాల్గొనేందుకు గాను వాలంటీర్ల ద్వారా అన్ని గ్రామాలు, వార్డుల్లో ప్రచారం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. పోటీల్లో తొలి ఐదు రోజులు గ్రామ స్థాయిలో, 12 రోజులు మండల స్థాయిలో, తర్వాత ఐదు రోజులు నియోజకవర్గ స్థాయిలో, 7 రోజులు జిల్లా స్థాయిలో పోటీలు జరుగు తాయన్నారు. క్రికెట్‌కు 16 మందితో, బాడ్మింటన్‌కు ఇద్దరు, కబడ్డీకి 12 మందితో, 15 మందితో ఖోఖోజట్టును, వాలీబాల్‌కు 12 మంది రిజిష్టర్‌ కావలసి వుంటుందన్నారు. క్రీడల నిర్వహణకు అవసరమైన కిట్‌లు, ఇతర క్రీడా సామాగ్రిని సరఫరా చేస్తున్నామని చెప్పారు. పోటీలకు కృష్ణజింకను క్రీడల చిహ్నంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. సమావేశంలోజెడ్‌పి సిఇఒ కె.రాజ్‌కుమార్‌, సెట్విజ్‌ సిఇఒ కె.రాంగోపాల్‌ పాల్గొన్నారు.

➡️