ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజవర్గాల కేంద్రాల్లో జరిగిన వైసిపి సామాజిక సాధికారిత బస్సుయాత్రకు విశేష స్పందన లభించిందని వైసిపి జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం స్థానిక జెడ్‌పి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి విజయనగరం జిల్లాలో రాజం నియోజకవర్గాన్ని కలుపుకొని ఇప్పటికే ఎనిమిది నియోజకవర్గాల్లో సామాజిక సాధికార బస్సుయాత్ర పూర్తి చేసుకున్నామని తెలిపారు. గత ప్రభుత్వాల మాదిరి మాటలకు పరిమితం కాకుండా జగన్ మోహన్ రెడ్డి రాజ్యాంగ స్ఫూర్తితో స్వతంత్ర సమరయోధుల ఆశయాలకు అనుగుణంగా నిజమైన సామాజిక న్యాయాన్ని పాటించి పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని అన్నారు. ఈ నెల నుంచి పరిపాలన రాజధానిలో కార్యకలాపాలు మొదలుపెట్టడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా విశాఖకు తరలి రాబోతున్నారని తెలిపారు. డిసెంబర్ 15 నుంచి సచివాలయం స్థాయిలో జరగబోయే ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 వేల సచివాలయాల పరిధిలో ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమంలో క్రికెట్, కబడ్డీ, కోకో, వాలీబాల్ ,బ్యాట్మెంటన్ పోటీలు మొదటిగా సచివాలయ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గస్థాయి, చివరగా రాష్ట్రస్థాయిలో జరుగుతాయని తెలిపారు. ఈ ఆటల పోటీలకు మొత్తంగా 12 కోట్ల రూపాయలు నగదును బహుమతి రూపంలో రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. సమావేశంలో పలాస నియోజకవర్గ పరిశీలకు కె.వి సూర్యనారాయణ రాజు (పులి రాజు) పాల్గొన్నారు.