ప్రజాశక్తి-విజయనగరం : ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా వచ్చే ఫారమ్ 6, 7, 8 పరిశీలన 15 రోజుల్లోనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి స్పష్టం చేశారు. ఇతర ధరఖాస్తులను 30రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై వివిధ నియోజకవర్గాల ఇఆర్‌ఒలు, ఆర్‌డిఒలు, ఎఇఆర్‌ఒలు, ఎన్నికల డిటిలతో కలెక్టరేట్ నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మండలాల వారీగా సమీక్షించారు. కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడుతూ జాబితాలో ఒకే డోరు నెంబరుతో అధికంగా ఓటర్లు ఉన్నవారిని, ఒకే ఇంటిలో పది మంది కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నవాటిని వెంటనే పరిశీలించి సరి చేయాలన్నారు. అలాగే వందేళ్లు దాటిన వారు జిల్లాలో 23 మంది వరకు ఉన్నారని, వీరి ఇళ్లకు వెళ్లి తనిఖీ నిర్వహించాలని సూచించారు. కొంతమంది పేర్లు ఓటర్ల జాబితాలో కనిపించడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయని, అటువంటి వాటిని పరిశీలించి అర్హులైన వారి పేర్లను చేర్చాలని ఆదేశించారు. మరణించిన వారి పేర్లు జాబితాల్లో ఉన్నాయన్న ఫిర్యాదులు కూడా అందుతున్నాయని, మరణించిన కుటుంబ సభ్యులకు నోటీసు ఇచ్చి పేర్లు తొలగించాలని సూచించారు. దీనికోసం మరణ ధ్రువీకరణ పత్రం అక్కరలేదని, పంచానామా నిర్వహించి కూడా వారి పేర్లను జాబితాల నుంచి తొలగించవచ్చునని చెప్పారు. నవంబరు 30 నాటికి మరణించిన వారి పేర్లను జాబితాలనుంచి తొలగించి, ఖచ్చితమైన జాబితాలను రూపొందించాలని ఆదేశించారు. తప్పుడు ఫిర్యాదులు, తప్పుడు ధ్రువీకరణలు ఇచ్చిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వచ్చే శని, ఆదివారాల్లో జరిగే ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంపై దృష్టి పెట్టి, అర్హులైన వారందరినీ ఓటర్లుగా చేర్పించాలని చెప్పారు. ముఖ్యంగా 18, 19 ఏళ్ల వారిపై దృష్టి సారించాలని, అందరినీ ఓటర్లుగా నమోదు చేయాలని కోరారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డిఆర్‌ఒ ఎస్‌డి అనిత, ఆర్‌డిఒలు, ఇఆర్‌ఒలు పాల్గొన్నారు.